Team India: బౌలింగ్ ప్రాక్టీస్ ఇంకా మొదలుపెట్టని పాండ్యా.. శ్రీలంక మ్యాచ్‌కూ దూరం!

Hardik Pandya likely to miss games vs England and Sri Lanka due to sprain in ankle

  • నేషనల్ క్రికెట్ అకాడమీలో చికిత్స తీసుకుంటున్న పాండ్యా
  • ఇంకా ప్రాక్టీస్‌కు దూరంగానే స్టార్ ఆల్‌రౌండర్
  • నాకౌట్ దశకు పూర్తి ఫిట్‌గా ఉండాలని ఆశిస్తున్న జట్టు మేనేజ్‌మెంట్

చీలమండ గాయంతో బాధపడుతున్న టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా ఇంకా కోలుకోలేదు. బంగ్లాదేశ్‌పై మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తున్న సమయంలో గాయమవ్వడంతో మైదానాన్ని వీడాల్సి వచ్చింది. తీవ్రత దృష్ట్యా తిరిగి గ్రౌండ్‌లో అడుగుపెట్టలేదు. ఆ తర్వాత న్యూజిలాండ్‌పై మ్యాచ్‌కు దూరమయ్యాడు. కీలకమైన తదుపరి మ్యాచ్‌లకు అందుబాటులోకి వస్తాడని భావించినా ఆ అవకాశం కనిపించడం లేదు. పాండ్యా ఇంకా ప్రాక్టీస్ మొదలుపెట్టలేదని తెలుస్తోంది. దీంతో టీమిండియా అక్టోబర్ 29న ఇంగ్లండ్, నవంబర్ 2న జరగబోయే శ్రీలంక మ్యాచ్‌లకూ అతడు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

చీలమండ గాయంతో బాధపడుతున్న హార్ధిక్ పాండ్యా ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చికిత్స తీసుకుంటున్నాడు. అక్కడ వైద్య బృందం మెరుగైన చికిత్స అందిస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. అయితే ఇంకా ప్రాక్టీస్ మొదలుపెట్టలేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పాండ్యా నాకౌట్ దశకు పూర్తి ఫిట్‌గా ఉండాలని జట్టు మేనేజ్‌మెంట్ కోరుకుంటోందని, అందుకే కోలుకునేందుకు తగిన సమయం ఇవ్వాలని భావిస్తోందని ఒక జాతీయ మీడియా రిపోర్ట్ పేర్కొంది. అయితే ఈ అంశంపై అధికారిక ప్రకటన వెలువడ్డాకే పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశముంది.

కాగా బంగ్లాదేశ్‌పై మ్యాచ్‌లో బౌలింగ్ చేసే సమయంలో బ్యాట్స్‌మెన్ కొట్టిన ఓ బంతి ఆపే ప్రయత్నంలో పాండ్యా చీలమండకు గాయమైంది. ఆ ఓవర్‌లో కేవలం మూడు బంతులే వేసిన పాండ్యా తిరిగి మైదానంలోకి అడుగుపెట్టలేదు. హాస్పిటల్‌కు తీసుకెళ్లి స్కానింగ్ తీయించి చికిత్సకు రిఫర్ చేశారు. న్యూజిలాండ్‌పై మ్యాచ్‌లో పాండ్యా లేని లోటు చాలా స్పష్టంగా కనిపించిన విషయం తెలిసినదే.

  • Loading...

More Telugu News