Kalvakuntla Kavitha: తెలంగాణలో బీజేపీకి నో చాన్స్: కవిత
- నిజామాబాద్ లో మీడియాతో కవిత చిట్ చాట్
- తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే అని స్పష్టీకరణ
- వంద సీట్లతో హ్యాట్రిక్ కొడతామని కవిత ధీమా
- కేసీఆర్ పై ఎవరు పోటీ చేసినా ఓటమి ఖాయమని వెల్లడి
తెలంగాణలో పూర్తిగా ఎన్నికల వాతావరణం నెలకొంది. ఏ నేతను కదిపినా ప్రత్యర్థులపై విమర్శలు చేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇవాళ నిజామాబాద్ లో మీడియాతో ముచ్చటించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తెలంగాణలో బీజేపీకి అవకాశమే లేదన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీనే మళ్లీ అధికారంలోకి వస్తుందని, వంద స్థానాలతో హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ పై ఎవరు పోటీ చేసినా ఓటమి ఎదుర్కోవాల్సిందేనని అన్నారు. కోరుట్లలో అర్వింద్ కు ఓటమి తప్పదని ఆమె హెచ్చరించారు.
ఇక, ఇతర పార్టీల మేనిఫెస్టోను కాపీ కొట్టాల్సిన అవసరం తమకు లేదని కవిత స్పష్టం చేశారు. కాంగ్రెస్ గ్యారెంటీలను తెలంగాణలో ఎవరైనా నమ్ముతారా? అని ప్రశ్నించారు. మైనారిటీ వర్గాలను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ఓటు బ్యాంకుగానే చూస్తుందని విమర్శించారు. ఈ ఎన్నికలు రాహుల్ వర్సెస్ రైతులు అని కవిత అభివర్ణించారు.