Greg Chappell: ఆర్థిక ఇబ్బందుల్లో టీమిండియా మాజీ కోచ్... నిధుల సేకరణ చేపట్టిన సన్నిహితులు

Greg Chappell caught in financial troubles as friends start GoFundMe campaign

  • గ్రెగ్ చాపెల్ ను ఆదుకునేందుకు స్నేహితుల చొరవ
  • GoFundMe ప్రచారం ప్రారంభించిన ఫ్రెండ్స్
  • సన్నిహితుల ప్రతిపాదనకు ఇష్టం లేకపోయినా అంగీకరించానన్న చాపెల్

ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం గ్రెగ్ చాపెల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో టీమిండియా కోచ్ గా వ్యవహరించిన చాపెల్ ఫలితాల కంటే వివాదాలతోనే ఎక్కువ ప్రాచుర్యం పొందాడు. అప్పటి సారథి సౌరవ్ గంగూలీతో గ్రెగ్ చాపెల్ గొడవలు అందరికీ తెలిసిందే. 

టీమిండియా కోచ్ గా వైదొలిగాక... చాపెల్ ను ఏ విదేశీ జట్టూ దగ్గరికి రానివ్వలేదు. అతడితో క్రికెట్ ఆడినవాళ్లు కామెంటేటర్లుగా, ఇతర క్రికెట్ సంబంధిత వృత్తుల్లో బిజీగా ఉంటూ కాస్తోకూస్తో వెనకేసుకున్నారు. కానీ గ్రెగ్ చాపెల్ మహాశయుడు మాత్రం నోటి దురుసుతనంతో అందరినీ దూరం చేసుకుని, ఇప్పుడు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు. 

చివరికి చాపెల్ ను గట్టెక్కించేందుకు అతడి సన్నిహితులు పూనుకోవాల్సి వచ్చింది. అతడి కోసం నిధులు సేకరించేందుకు స్నేహితులు GoFundMe పేరిట ఆన్ లైన్ లో నిధులు సేకరిస్తున్నారు. ఒకప్పుడు తన మాటే శాసనం అన్నట్టుగా వ్యవహరించిన గ్రెగ్ చాపెల్ ఇప్పుడు విధిలేని పరిస్థితుల్లో స్నేహితుల మాటకు సరేనన్నాడు. 

ఈ మేరకు ఓ కార్యక్రమం ఏర్పాటు చేయగా... గ్రెగ్ చాపెల్ తో పాటు అతడి ఇద్దరు సోదరులు ఇయాన్ చాపెల్, ట్రెవర్ చాపెల్ కూడా విచ్చేశారు. ఈ సందర్భంగా గ్రెగ్ చాపెల్ మాట్లాడుతూ, తాను మరీ ఆర్థికంగా ఏమీ దిగజారిపోలేదని, కానీ ఈ తరం క్రికెటర్లు అనుభవిస్తున్న లగ్జరీకి దూరమయ్యానని తెలిపారు. నిధులు సేకరించేందుకు తన స్నేహితులు ముందుకు వచ్చారని, వారి ఆలోచన తనకు ఇష్టం లేకపోయినా సరేనన్నానని వెల్లడించారు. 

ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత కూడా ప్రొఫెషనల్ క్రికెట్ తో సంబంధాలు ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని వివరించారు. తన స్నేహితులు సేకరిస్తున్న నిధులను తానొక్కడినే తీసుకోవడంలేదని, తనలాగే ఇబ్బందులు పడుతున్న క్రికెటర్లకు కూడా వాటిని అందిస్తానని గ్రెగ్ చాపెల్ వివరించారు.

అనేకమంది క్రికెటర్లు కెరీర్ లో ఉన్నతస్థాయికి ఎదిగేందుకు సాయపడ్డానని, తన వల్ల సాయం పొందిన వారు ఇవాళ తన పరిస్థితిని గుర్తిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News