Telangana: తెలంగాణలో ఎన్నికల తనిఖీలు.. ఇప్పటివరకు రూ.347 కోట్ల సొత్తు స్వాధీనం
- అక్టోబర్ 9 నుంచి రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్
- నాటి నుంచి పోలీసుల ముమ్మర తనిఖీలు
- నగదు, బంగారు, వెండి ఆభరణాలు, మద్యం స్వాధీనం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్టోబర్ 9 నుంచి నేటి వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.347.16 కోట్ల సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 9న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో కోడ్ అమలులోకి వచ్చింది. ఆ రోజు నుంచి పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. నాటి నుంచి గురువారం వరకు పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద మొత్తంలో నగదు, డబ్బును సీజ్ చేశారు.
అక్టోబర్ 9వ తేదీ నుంచి ఇప్పటి వరకు రూ.122.62 కోట్ల నగదును సీజ్ చేశారు. రూ.156.22 కోట్ల విలువైన బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. రూ.20.70 కోట్ల విలువైన మద్యాన్ని పట్టుకున్నారు. తనిఖీల్లో రూ.17.18 కోట్ల విలువైన డ్రగ్స్ కూడా పట్టుబడ్డాయి. ఓటర్ల కోసం పంపిణీకి సిద్ధం చేసిన రూ.30.42 కోట్ల విలువైన కానుకలను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.