Janasena: ఈ నెల 29 నుంచి మూడ్రోజుల పాటు జనసేన-టీడీపీ జిల్లాస్థాయి సమన్వయ సమావేశాలు
- పొత్తు కుదుర్చుకున్న టీడీపీ, జనసేన
- ఇటీవల రాజమండ్రిలో ఇరు పార్టీల సమన్వయ కమిటీ సమావేశం
- ఈ నెల 29, 30, 31 తేదీల్లో జిల్లా స్థాయి సమన్వయ సమావేశాలు
- జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులకు దిశానిర్దేశం చేసిన నాదెండ్ల
వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన పార్టీ చేయి కలిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో, ఇటీవల ఇరు పార్టీల సమన్వయ కమిటీ తొలిసారిగా భేటీ అయింది. జిల్లా స్థాయిలోనూ సమన్వయ సమావేశాలు జరపాలని కమిటీ భేటీలో నిర్ణయించారు.
ఈ నేపథ్యంలో, ఈ నెల 29 నుంచి 31 వరకు మూడ్రోజుల పాటు జనసేన-టీడీపీ జిల్లా స్థాయి సమన్వయ సమావేశాలు జరపనున్నట్టు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. జనసేన తరఫున ఆయా జిల్లాల పరిధిలోని ఇన్చార్జులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, ముఖ్య నాయకులతో కలిపి 50 మంది వరకు సమన్వయ సమావేశంలో పాల్గొనేలా కార్యాచరణ రూపొందించినట్టు వివరించారు.
ఇవాళ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులతో నాదెండ్ల మనోహర్ ఫోన్ కాల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా స్థాయి సమన్వయ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై వారికి దిశానిర్దేశం చేశారు. జనసేన-టీడీపీ సమన్వయ సమావేశాలు విజయవంతం అయ్యేందుకు కృషి చేయాలని సూచించారు.
అదే సమయంలో, రెండు పార్టీలు కలవకూడదన్న ఉద్దేశంతో ప్రత్యర్థి పార్టీ వ్యక్తులు కుట్రలు చేస్తున్నారని, వారి ఉచ్చులో పడొద్దంటూ పార్టీ శ్రేణులను నాదెండ్ల అప్రమత్తం చేశారు. ఇక, పొత్తులోకి బీజేపీ కూడా కలిసి రావాలని కోరుకుంటున్నామని వెల్లడించారు.