Ayodhya Ram Mandir: రామమందిరం నిర్మాణ పనుల వీడియో విడుదల చేసిన ట్రస్ట్
- 500 ఏళ్ల పోరాటానికి ఇది ముగింపు అంటూ వ్యాఖ్య
- నెట్టింట వీడియో వైరల్
- వచ్చే ఏడాది జనవరి 22న మందిర ప్రారంభోత్సవం
- ప్రధాని మోదీని ఆహ్వానించిన ట్రస్టు సభ్యులు
అయోధ్యలో జనవరి 22న రామమందిర ప్రారంభోత్సవం జరగనున్న విషయం తెలిసిందే. శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మరోవైపు, రామమందిర తీర్థ ట్రస్టు ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. గోడలు, ద్వారాలపై శిల్ప కళ ఉట్టిపడేలా ఆలయాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఈ పనులకు సంబంధించిన వీడియోను రామమందిర ట్రస్టు తాజాగా విడుదల చేసింది. ‘500 ఏళ్ల పోరాటానికి ఇది ముగింపు’ అనే క్యాప్షన్‌తో ‘ఎక్స్’ వేదికగా షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
కాగా, రామమందిర ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ హాజరు కానున్న విషయం తెలిసిందే. మందిర ట్రస్టు సభ్యులు బుధవారం ప్రధానిని కలిసి ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. ఇది భావోద్వేగపూరిత రోజు అంటూ మోదీ ఆ తరువాత ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు. ఈ చారిత్రాత్మక క్షణాన్ని వీక్షించే అవకాశం లభించడం తన అదృష్టమని వ్యాఖ్యానించారు.
రామమందిరం ప్రారంభోత్సవంలో దేశవ్యాప్తంగా ఉన్న 136 సనాతన సంప్రదాయాలకు సంబంధించి 25 వేల మంది హిందూ సంఘాల నేతలు, మరో పాతిక వేల మంది సాధువులు, పది వేల మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించాలని ట్రస్ట్ యోచిస్తున్నట్టు సమాచారం.