Mohammed Rizwan: రోహిత్, విరాట్ మైదానంలో ఎప్పుడైనా హారతి ఇచ్చారా?.. ముహమ్మద్ రిజ్వాన్‌కు పాక్ మాజీ క్రికెటర్ ప్రశ్న
- మైదానంలో ముహమ్మద్ రిజ్వాన్ నమాజ్ చేయడంపై పాక్ మాజీ క్రికెటర్ డానిశ్ కనేరియా గుస్సా
- ప్రార్థనలను డ్రెస్సింగ్ రూంకే పరిమితం చేయాలని సూచన
- ప్రస్తుత పాక్ టీంకు మతమే తొలి ప్రాధాన్యంగా మారిందని విమర్శ
- షమీ, సిరాజ్ ఇలాగే మైదానంలో ప్రార్థనలు చేశారా? అంటూ సూటి ప్రశ్న
ఇటీవల వరల్డ్ కప్ మ్యాచ్ సందర్భంగా పాక్ వికెట్ కీపర్ ముహమ్మద్ రిజ్వాన్ మైదానంలోనే ప్రార్థన చేయడంపై ఆ దేశ మాజీ క్రికెటర్ డానిశ్ కనేరియా మండిపడ్డాడు. క్రీడాకారులు తమ ప్రార్థనలను డ్రెస్సింగ్ రూంకే పరిమితం చేయాలని సూచించాడు. భారత్ ప్లేయర్లకు కూడా దైవభక్తి ఉందని కానీ వారెవ్వరూ ఇలా బహిరంగంగా భక్తిప్రదర్శనకు దిగరని మండిపడ్డారు.
‘‘ప్రస్తుత పాకిస్థాన్ టీం మతానికే తొలి ప్రాధాన్యం ఇస్తోంది. ఆ తరువాత రాజకీయాలకు, చివరిగా ఆటకు ప్రాధాన్యమిస్తుంది. వీళ్ల తీరు ఏంటో నాకు అర్థంకావట్లేదు. నమాజ్ చేయాలంటే డ్రెస్సింగ్ రూంలో చేసుకోవచ్చుగా! ఇలా అందరి ముందూ చేయాల్సిన అవసరం ఏముంది. మేమూ పూజలు చేస్తాం కానీ మైదానంలో హారతి ప్రారంభించం కదా? రోహిత్, విరాట్‌కు భక్తి లేదని నువ్వు అనుకుంటున్నావా? లేదా ముహ్మద్ సిరాజ్, మొహ్మద్ షమీ నమాజ్ చేయరని భావిస్తున్నావా?’’ అంటూ కనేరియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.
పాక్ టీంకు ఆడిన రెండో హిందూ క్రీడాకారుడిగా డానిశ్ కనేరియా చరిత్ర సృష్టించాడు. అయితే, తాను పాక్ టీంలో ఉన్నప్పుడు మతం కారణంగా తోటి సభ్యుల నుంచి వివక్ష ఎదుర్కొన్నానని గతంలో ఆరోపించాడు. ‘‘అర్ధరాత్రి ఫోన్ చేసి నమాజ్ సమయం గురించి నాకు చెప్పేవారు. ఇలా రెండు మూడు సార్లు జరగడంతో విసుగొచ్చి నాకు ఫోన్ చేయకండని వారికి చెప్పేశా. ఇంజమామ్ ఉల్ హక్ టీం నుంచి తప్పుకున్నాక వివక్ష పెరిగిపోయింది’’ అని తెలిపాడు. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు కనేరియాపై జీవితకాల నిషేధం విధించడంతో అతడి కెరీర్ అర్ధాంతరంగా ముగిసిపోయింది.