Lord Hanuman: దసరా ఉత్సవాలను గాల్లో ఎగురుతూ చిత్రీకరించిన ‘హనుమంతుడు’.. జై హనుమాన్ అంటూ నినాదాలు.. వీడియో ఇదిగో!
- డ్రోన్‌కు హనుమంతుడి రూపం
- ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లో ఘటన
- చూసేందుకు పోటెత్తిన జనం
రామభక్తుడైన హనుమంతుడు బలశాలి. గాల్లో ఎగురుకుంటూ వెళ్లి సంజీవనీ పర్వతాన్ని మోసుకొచ్చాడు. సముద్రాలు దాటి లంకలో ఉన్న సీతమ్మ బాగోగులు కనుక్కొచ్చాడు. హనుమంతుడు గాల్లో ఎగురుతుండగా సినిమాల్లో చూడ్డం, కథలుగా వినడం తప్ప అంతకుమించి తెలియదు. కానీ, ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లో దసరా రోజున ఆంజనేయుడు ఎగురుతూ కనిపించాడు. అది చూసి జనం అమితాశ్చర్యానికి గురయ్యారు.
అసలు సంగతేంటంటే.. అంబికాపూర్‌లో ఈ నెల 24న దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆ వేడుకలను డ్రోన్ ద్వారా చిత్రీకరించాలనుకున్నారు. అయితే, మామూలుగా అయితే మజా ఏముంటుందని భావించిన నిర్వాహకులు ఆ డ్రోన్ అచ్చం గాల్లో ఎగురుతున్న ఆంజనేయుడిలా తీర్చిదిద్దాలనుకున్నారు. ఆ వెంటనే గాల్లో ఎగురుతున్నట్టుగా ఉన్న ఆంజనేయుడి ప్రతిమను తయారుచేసి దానికి బిగించారు.
అంబికాపూర్‌లోని మహామాయ ఆలయం వద్ద జరిగిన భారీ ఊరేగింపును ఈ ఆంజనేయుడి డ్రోన్‌తో చిత్రీకరించారు. గాల్లో ఎగురుతున్న ‘హనుమంతుడి’ని చూసిన జనం కేరింతలతో తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. జై హనుమాన్ అంటూ నినాదాలు చేశారు. కింద ఊరేగింపును బంధిస్తున్న డ్రోన్‌ను జనం తమ సెల్ఫోన్లు, కెమెరాల్లో బంధించారు. ఇప్పుడీ హనుమాన్ డ్రోన్ నెట్టింట వైరల్‌గా మారింది.