- బాబిలోనా సోదరుడు అనుమానాస్పద రీతిలో మృతి
- చెన్నైలోని అపార్ట్ మెంట్ లో మృతి చెందిన విక్కీ
- విక్కీపై క్రిమినల్ ట్రాక్ రికార్డ్ కూడా ఉన్న వైనం
బాబిలోనా.. ఒకప్పుడు తన అందచందాలతో మలయాళ చిత్రపరిశ్రమను ఊపేసిన నటి. తెలుగు చిత్రాల్లో కూడా ఆమె నటించారు. ఇప్పటికీ ఆమెకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. తాజగా బాబిలోనా ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె సోదరుడు విఘ్నేష్ కుమార్ అలియాస్ విక్కీ చెన్నైలోని తన నివాసంలో అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. ఆయన వయసు 40 ఏళ్లు. చెన్నైలోని సాలిగ్రామం దశరథపురంలోని అపార్ట్ మెంట్ లో ఆయన కొన్నేళ్లుగా ఒంటరిగా ఉంటున్నారు.
విక్కీ మృతి విషయాన్ని ఆయన స్నేహితుడు విరుగంబాక్కం పోలీసులకు సమాచారం అందించాడు. అపార్ట్ మెంట్ కు చేరుకున్న పోలీసులు బెడ్ రూమ్ లో విగతజీవిగా పడి ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. చెన్నైలోని కీల్పాక్కం ప్రభుత్వ ఆసుపత్రికి ఆయన మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. మరోవైపు విక్కీకి క్రిమినల్ ట్రాక్ రికార్డ్ కూడా ఉంది. గతంలో అతను పలు నేరాలకు పాల్పడినట్టు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం ఆయనను వలసరవాక్కంలో పెట్రోలింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మద్యం మత్తులో గొడవ చేయడంతో అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఆయన తల్లి ఫిర్యాదుతో ఆయన మృతిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదిలావుంచితే, బాబిలోనా అసలు పేరు భాగ్యలక్ష్మి. తెలుగు కుటుంబానికి చెందిన ఆమె శృంగార నటిగా పేరు తెచ్చుకున్నారు. సుందర్ బాబుల్ అనే పారిశ్రామికవేత్తను 2015లో ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు.