Jeevan Reddy: కామారెడ్డిలో కేసీఆర్పై రేవంత్ రెడ్డి పోటీ చేస్తే కాంగ్రెస్ గెలిచే తొలి సీటు అదే: జీవన్ రెడ్డి
- కేసీఆర్ను ఓడించే దమ్ము రేవంత్ రెడ్డికి మాత్రమే ఉందన్న జీవన్ రెడ్డి
- రేవంత్ పోటీ చేస్తే ఆ ప్రభావం ఉత్తర తెలంగాణవ్యాప్తంగా ఉంటుందన్న కాంగ్రెస్ నేత
- కేసీఆర్పై పోటీకి సిద్ధమన్న రేవంత్ మొండోడు... ధైర్యవంతుడని కితాబు
- కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కాళేశ్వరంపై విచారణ జరిపిస్తామని వెల్లడి
కామారెడ్డిలో ముఖ్యమంత్రి కేసీఆర్పై తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీ చేస్తే కనుక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మనం గెలవబోయే మొదటి స్థానం అదే నియోజకవర్గమవుతుందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ను ఓడించే దమ్ము రేవంత్ రెడ్డికి మాత్రమే ఉందన్నారు. కామారెడ్డిలో రేవంత్ కనుక పోటీ చేస్తే ఆ ప్రభావం కేవలం నిజామాబాద్ వరకు మాత్రమే కాదని, ఉత్తర తెలంగాణవ్యాప్తంగా ఉంటుందన్నారు.
కేసీఆర్పై పోటీకి సిద్ధమని ప్రకటించిన రేవంత్ రెడ్డిని ఈ విషయంలో తాను మెచ్చుకుంటున్నట్లు తెలిపారు. రేవంత్ మొండోడు... ధైర్యవంతుడని కితాబునిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి చైనాలో జరిగి ఉంటే బాధ్యులను ఉరితీసేవారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపిస్తామన్నారు. జ్యూడిషియల్ విచారణ చేయించి బాధ్యులను కటకటాల్లోకి పంపిస్తామన్నారు.
ఉమ్మడి ఏపీలో నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించిన నాగార్జునసాగర్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు చెక్కుచెదరలేదని గుర్తు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారలోకి రాగానే తాము ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామన్నారు. బీఆర్ఎస్-బీజేపీ అంతర్గత ఒప్పందం ప్రజలకు తెలిసిపోయిందన్నారు. అందుకే తమ పార్టీపై ఆ రెండు పార్టీలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయన్నారు.