Narayana Murthy: ఇన్ఫోసిస్ నారాయణమూర్తిని దారుణంగా ట్రోల్ చేస్తున్న ఐటీ ఉద్యోగులు
- వారానికి 70 గంటలు పని చేస్తే ఆర్థిక రంగంలో ఊహించని విజయాలను సాధిస్తామన్న నారాయణమూర్తి
- ఇన్ఫోసిస్ లో కొత్త ఉద్యోగులకు 2005లో ఇచ్చిన జీతాన్నే ఇప్పుడు కూడా ఇస్తున్నారంటున్న ఐటీ ఉద్యోగులు
- జీతం పెంచితే అంకితభావంతో పని చేస్తామంటూ ట్రోలింగ్
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అనవసర వివాదంలో చిక్కుకున్నారు. యువత వారానికి 70 గంటలు పని చేస్తే మన దేశ ఆర్థిక రంగంలో ఊహించని విజయాలను సాధించవచ్చని ఆయన సూచించారు. చైనా లాంటి దేశాలతో పోలిస్తే మన దేశంలో పని గంటలు తక్కువని... ప్రపంచంలోనే తక్కువని అన్నారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్, జర్మనీ ప్రజలు ఏ విధింగా విధులను నిర్వహించారో... మనం కూడా అలానే చేయాలని అన్నారు. ఉద్పాదకత విషయంలో భారత్ వెనుకబడిందని... దీన్ని పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ఈ నేపథ్యంలో, నారాయణమూర్తి వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2005లో ఇన్ఫోసిస్ లో కొత్త ఉద్యోగంలో చేరేవారికి ఏడాదికి రూ. 3.5 లక్షల జీతం ఉండేదని... ఇప్పుడు కూడా అదే జీతాన్ని ఇస్తున్నారని ఐటీ నిపుణులు విమర్శిస్తున్నారు. దేశం ద్రవ్యోల్బణం నుంచి గట్టెక్కేలా ఆయన ఏడాదికి రూ. 15 లక్షల ప్యాకేజీ ఇస్తే ఆయన అంచనాలకు మించి 40 గంటల పాటు అంకితభావంతో పని చేస్తామని చెపుతున్నారు.