dharmapuri arvind: సిరిసిల్లలో కేటీఆర్ లోకల్ అయితే కోరుట్లలో నేనూ లోకలే: ధర్మపురి అర్వింద్
- కోరుట్ల నుంచి పోటీ చేయడం తన అదృష్టమన్న అర్వింద్
- కోరుట్ల రాజకీయాల్లో పెను మార్పులు తీసుకువస్తుందన్న ఎంపీ
- డబ్బులు పంచకుండానే కోరుట్లలో అద్భుత విజయం సాధిస్తామని ధీమా
- కేసీఆర్ అబద్దాన్ని చాలా అందంగా చెబుతారని విమర్శలు
ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీఆర్ సిరిసిల్లలో లోకల్ అయినప్పుడు ధర్మపురి శ్రీనివాస్ కొడుకునైన తాను కోరుట్లలో లోకల్ అవుతానని, లోకల్-నాన్ లోకల్ అనే వారికి ఇదే తన సమాధానం అని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... నేల తల్లి నుదిటిన తిలకం దిద్దిన యువతది ఈ కోరుట్ల ప్రాంతమని, ఇక్కడి నుంచి తాను పోటీ చేయడం పూర్వ జన్మ సుకృతమన్నారు. రాజకీయాల్లో కోరుట్ల పెను మార్పులను తీసుకు వస్తుందన్నారు.
కోరుట్లలో బీజేపీ గెలవడం ద్వారా సరికొత్త రాజకీయాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. డబ్బులు ఏమీ పంచకుండానే కోరుట్లలో బీజేపీ అద్భుత విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ అబద్ధాన్ని చాలా అందంగా చెబుతారన్నారు. ఈవీఎంలలో రోడ్డు రోలర్, కారు గుర్తులను గుర్తించేందుకే కేసీఆర్ కంటి వెలుగును తీసుకు వచ్చారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం పక్కా అన్నారు.