Harish Rao: కాంగ్రెస్ దుష్టపాలనకు పక్కనే ఉన్న కర్ణాటక సాక్ష్యం: హరీశ్ రావు
- తెలంగాణను నిలబెట్టుకోవాలని కేసీఆర్ ప్రయత్నమన్న హరీశ్ రావు
- రాష్ట్రాన్ని ఆగం చేయాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయని ఆరోపణ
- కేసీఆర్ ఆమరణ దీక్ష చేసి ఢిల్లీ మెడలు వంచారని వ్యాఖ్య
- కేసీఆర్ పథకాలను కాంగ్రెస్ కాపీ కొడుతోందని విమర్శలు
తెలంగాణను నిలబెట్టుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నం చేస్తుంటే, ప్రతిపక్షాలు ఈ రాష్ట్రాన్ని ఆగం చేయాలని చూస్తున్నాయని మంత్రి హరీశ్ రావు శుక్రవారం మండిపడ్డారు. ఆందోల్ నియోజకవర్గంలో జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కాంగ్రెస్ అంటేనే నయవంచన అని, బీఆర్ఎస్ అంటే నమ్మకమన్నారు. 2018లో అలయ్ బలయ్తో క్రాంతి ఎమ్మెల్యేగా గెలిచారని, ఈసారీ భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. నాడు తెంగాణ కోసం పదకొండు రోజులు ఆమరణదీక్ష చేసి కేసీఆర్ ఢిల్లీ మెడలు వంచాడన్నారు.
కాంగ్రెస్ దుష్టపాలనకు ప్రత్యక్ష సాక్ష్యం పక్కనే ఉన్న కర్ణాటక అన్నారు. అక్కడ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదన్నారు. అందుకే కాంగ్రెస్ అంటే ఝూటాకోర్ పార్టీ అన్నారు. కాంగ్రెస్ వారిని నమ్మితే నిండా మోసపోతామన్నారు. కేసీఆర్ పథకాలను కాంగ్రెస్ కాపీ కొడుతోందన్నారు. మనది అద్భుతమైన మేనిఫెస్టో అనీ, ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
పనితనం తప్పా, పగతనం తెలియని నాయకుడు కేసీఆర్ అన్నారు. లేదంటే కాంగ్రెస్ వాళ్లు సగం మంది జైల్లో ఉండేవారన్నారు. గోరటి వెంకన్న పల్లెపల్లేనా పల్లేర్లు మొలిచే అని రాశారన్నారు. నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన అని కూడా రాశారన్నారు. ఇలాంటి పాటలన్నింటిని ఇప్పుడు తిరగ రాయాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు. ఇందుకు కేసీఆర్ పాలనే కారణమన్నారు. కళ్ల ముందు, ఇంటి ముందు కనబడ్డ అభివృద్ధిని నమ్మాలన్నారు.