KCR: ఇక్కడ రింగ్ రోడ్డు కోసం ల్యాండ్ పూలింగ్ చేయం: వర్ధన్నపేటలో కేసీఆర్ హామీ
- బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తోందన్న కేసీఆర్
- షార్ట్ కట్ పద్ధతిలో గెలవాలని చూసేవాళ్లు అబద్దాలు చెబుతారన్న ముఖ్యమంత్రి
- రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలపై తీవ్ర ఆగ్రహం
వర్ధన్నపేటలో రింగ్ రోడ్డు కోసం ల్యాండ్ పూలింగ్ చేస్తారని దుష్ప్రచారం చేస్తున్నారని, రమేశ్ పైన గెలవలేని వారే ఇలాంటి అసత్య ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. ఇక్కడ ల్యాండ్ పూలింగ్ చేయబోమని హామీ ఇచ్చారు. వర్ధన్నపేటలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సదస్సులో ఆయన మాట్లాడుతూ... బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తోందన్నారు. షార్ట్ కట్ పద్ధతిలో గెలవాలని చూసేవాళ్లు అబద్ధాలు చెబుతారని, అలాంటి వారి మాటలు నమ్మవద్దన్నారు. ఇప్పుడు ఓట్ల కోసం వస్తోన్న వారికి తెలంగాణపై అవగాహన లేదన్నారు.
తెలంగాణ సాధించాక ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వస్తున్నామన్నారు. రూ.160 కోట్లతో వర్ధన్నపేటను అభివృద్ధి చేశామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల క్రితం వ్యవసాయం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా వుంది? అన్నది గుర్తించాలన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి 24 గంటలు విద్యుత్ వేస్ట్ అంటున్నారని, ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతు బంధు వేస్ట్ అంటున్నారని అలాంటి వారికి బుద్ధి చెప్పాలన్నారు. ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో కలిపేస్తామని మరికొంతమంది చెబుతున్నారని విమర్శించారు. కర్ణాటకలో కరెంట్ కోతల కారణంగా అక్కడి రైతులు ఆందోళనలు చేస్తున్నారని, ఇక్కడ అలాంటి పరిస్థితి లేదన్నారు.