Dhulipalla Narendra Kumar: చివరకు టీడీపీ సభ్యత్వ రుసుమును అవినీతి సొమ్ముగా చూపుతున్నారు: ధూళిపాళ్ల

Dhulipalla slams YCP leaders

  • చంద్రబాబుపై పెట్టిన స్కిల్ కేసు బోగస్ అన్న ధూళిపాళ్ల
  • సీఐడీ విచారణ తీరుతో ఆ విషయం స్పష్టమైందని వెల్లడి
  • ఇప్పుడు టీడీపీ సభ్యత్వ రుసుంపై పడ్డారని వ్యాఖ్యలు
  • గణాంకాలతో సహా వివరణ ఇచ్చిన టీడీపీ సీనియర్ నేత

స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుపై చేస్తున్న ఆరోపణల్లో పసలేదని ఆ పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ వ్యాఖ్యానించారు. చంద్రబాబుపై పెట్టిన స్కిల్ డెవలప్ మెంట్ కేసు బోగస్ కేసు అని సీఐడీ విచారణ తీరుతో తేలిపోయిందని స్పష్టం చేశారు. 

ఒక్క రూపాయి అయినా టీడీపీ అధినేతకు, లోకేశ్ కు, ఇతర నేతలకు వచ్చినట్టు జగన్ రెడ్డి గానీ, అతని జేబు సంస్థ సీఐడీ గానీ నిరూపించ లేకపోయిందని తెలిపారు. రాజకీయ కుట్రలో భాగంగానే చంద్రబాబుని అక్రమంగా తప్పుడు కేసులో ఇరికించి, అన్యాయంగా జైలుకు పంపారన్న టీడీపీ వాదన నిజమని నిర్ధారణ అయిందని స్పష్టం చేశారు. జగన్ ఆదేశాల ప్రకారం నడుచుకున్న సీఐడీ చివరకు ఒక 'గాసిప్ ఏజెన్సీ'గా నిలిచిందని విమర్శించారు. 

ఏమీ దొరక్క, చివరికి తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు స్వచ్ఛందంగా ఇచ్చిన విరాళాలను, సభ్యత్వం పొందడానికి చెల్లించిన రుసుముని అవినీతి సొమ్ముగా జగన్ ప్రభుత్వం, సీఐడీ చిత్రీకరించడం వారి దిగజారుడుతనానికి నిదర్శనం అని ధూళిపాళ్ల మండిపడ్డారు. 

టీడీపీ సభ్యత్వం పొందడానికి కార్యకర్తలు చెల్లించే సభ్యత్వ రుసుము... కార్యకర్తలు, వారి కుటుంబాలను ఆదుకోవడానికి పార్టీ అందించే ప్రతిరూపాయి... మొత్తం పారదర్శకమేనని స్పష్టం చేశారు. కార్యకర్తలు, పార్టీ మధ్య జరిగే ప్రతి చెల్లింపు వివరాలు ఎప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీ ఆదాయపన్ను విభాగానికి తెలియచేస్తూనే ఉంటుందని వెల్లడించారు. 

"2014-15లో 52.94 లక్షల మంది టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు. ఆ సభ్యత్వం పొందడానికి ఒక్కొక్కరు రూ.100 చొప్పున చెల్లిస్తే... తద్వారా పార్టీకి రూ.52.94 కోట్లు వచ్చాయి. 2016-17లో 60.75 లక్షల మంది కార్యకర్తలు సభ్యత్వం పొంది, రుసుముగా రూ.60.75 కోట్లు పార్టీకి అందించారు. 2018-19లో 43.23 లక్షల మంది సభ్యత్వం పొందితే, పార్టీకి రూ.43.23 కోట్లు వచ్చాయి. 

కార్యకర్తలు ఇచ్చే సభ్యత్వ రుసుము, ఇతర విరాళాల కంటే పార్టీ తనను నమ్ముకున్నవారికి అందించే చేయూత, సంక్షేమం, ఆర్థిక సహాయమే ఎక్కువగా ఉంది. చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను ఆదుకోవడం.. వారి పిల్లలను చదివించడం, సభ్యత్వం పొంది మరణించిన వారికి ఇన్సూరెన్స్ ప్రీమియం అందించడం వంటి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ చేపడుతోంది. 

2014-15 నుంచి 2018-19 వరకు టీడీపీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ ప్రీమియంగా రూ.68.53 కోట్లు పార్టీనే బీమా సంస్థలకు చెల్లించింది. 2018-19లోనే రూ.16.2 కోట్లు ప్రీమియంగా చెల్లించింది. ఓరియంటల్ ఇన్సూరెన్స్, నేషనల్ ఇన్సూరెన్స్, న్యూఇండియా వంటి సంస్థలకే ఒక్కో కార్యకర్తకు  రూ.2లక్షల చొప్పున దాదాపు చనిపోయిన 5 వేలమంది కుటుంబాలకు రూ.100 కోట్లను తెలుగుదేశం పార్టీ ఇన్సూరెన్స్ రూపంలో అందించింది. 

ఏ ఇన్సూరెన్స్ సంస్థ కూడా వివరాలు లేకుండా ఎలాంటి చెల్లింపులు చేయదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు చెల్లించిన ఇన్సూరెన్స్ ప్రీమియం వివరాలు కూడా బీమా సంస్థల వద్ద ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం వివరాలు, కార్యకర్తలు ఇచ్చే రుసుము వివరాలు అన్నీ పారదర్శకమే. 

యూనియన్ బ్యాంక్ సహకారంతో బిల్ కాల్ మనీ అనే సంస్థ ద్వారా టీడీపీ కార్యకర్తలు సభ్యత్వం పొందడానికి చెల్లించిన రుసుముని టీడీపీ డిపాజిట్ చేసింది. ఆ సొమ్ములో ఎక్కడా పైసా కూడా అవినీతి సొమ్ములేదు... ఉండదు. కానీ జగన్ సర్కార్, సీఐడీ... కార్యకర్తల కష్టార్జితాన్ని అవినీతిసొమ్ముగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది" అని ధూళిపాళ్ల వివరించారు. 

అధికారముందన్న అహంకారంతో మాట్లాడే మంత్రులను, వైసీపీ నేతలను ప్రజలు బట్టలు విప్పి పరుగులు పెట్టించే రోజు దగ్గర్లోనే ఉందని స్పష్టం చేశారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమమని ప్రజలు నమ్ముతున్నారని తెలిసి, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు విచక్షణ కోల్పోయి నోరు పారేసుకుంటున్నారని ధూళిపాళ్ల మండిపడ్డారు.

  • Loading...

More Telugu News