G. Kishan Reddy: బీజేపీ అధికారంలోకి వస్తే 'ఉచితం' ఇవే: కిషన్ రెడ్డి ప్రకటన
- కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే అన్న కిషన్ రెడ్డి
- బంగారు తెలంగాణకు బదులు బంగారు కుటుంబమైందని విమర్శ
- కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు గెలిచినా బీఆర్ఎస్లోకి వెళ్తారని ఎద్దేవా
- బీజేపీ అధికారంలోకి వస్తే రోజూ కార్యాలయానికి వచ్చే సీఎం వస్తారని వ్యాఖ్య
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం అందిస్తామని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. సూర్యాపేటలో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒకటే అన్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే బంగారు తెలంగాణ అవుతుందనుకుంటే బంగారు కుటుంబం మాత్రం అయిందని కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచినా వారు మళ్లీ కేసీఆర్‌కు అమ్ముడుపోవడం ఖాయమన్నారు.
బీజేపీ గెలిస్తే గ్రామపంచాయతీ నుంచి సీఎం కార్యాలయం వరకు అవినీతి లేకుండా చేస్తామన్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఆరు లైన్స్ జాతీయ రహదారిని, ఇండస్ట్రియల్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఉచిత విద్య, ఉచిత వైద్యంతో పాటు పంటల బీమా పథకం అమలు చేస్తామన్నారు. అవినీతిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
బీజేపీ గెలిస్తే ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రతిరోజు కార్యాలయానికి వచ్చే ముఖ్యమంత్రి వస్తారన్నారు. ఎవరు ఎన్ని చెప్పినా మెజార్టీ స్థానాలు బీజేపీ గెలుచుకోవడం ఖాయమన్నారు. కుటుంబ పాలన, అవినీతి రాజకీయాలకు వ్యతిరేకంగా బీజేపీ పోరాటం చేస్తోందన్నారు. కేసీఆర్ కాంగ్రెస్‌లోనే పుట్టారని, ఆ పార్టీలో పని చేశారని, ఈ విషయం రాహుల్ గాంధీకి తెలియదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కేసీఆర్ మంత్రిగా పని చేశారన్నారు. గతంలో పలుమార్లు కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నాయన్నారు.