Pakistan: అంపైర్ నిర్ణయంపై పాక్ కెప్టెన్ బాబర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. తెగ వైరల్!
- రౌఫ్ బౌలింగ్‌లో షమ్సీని ఔట్ ఇచ్చి ఉంటే ఫలితం మారేదని వ్యాఖ్య
- డీఆర్ఎస్‌లో నాటౌట్‌గా తేలినా తప్పుబట్టిన పాకిస్థాన్ సారధి
- సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వ్యాఖ్యలు
చెన్నై వేదికగా శుక్రవారం ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో పాకిస్థాన్ ఓటమిపాలైంది. ఇరుజట్ల మధ్య గెలుపు దోబూచులాడినప్పటికీ చివరికి దక్షిణాఫ్రికానే వరించింది. అయితే మ్యాచ్‌లో చోటుచేసుకున్న ఓ పరిణామంపై కెప్టెన్ బాబర్ ఆజమ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్‌కు ఒక వికెట్ కావాల్సిన సమయంలో హారీస్ రౌఫ్ వేసిన 46వ ఓవర్‌లో తబ్రైజ్ షమ్సీ ప్యాడ్స్ తాకిన బంతికి అంపైర్ ఎల్‌బీడబ్ల్యూ ఇచ్చివుంటే తామే గెలిచేవాళ్లమని, సెమీస్ రేసులో ఉండేవాళ్లమని బాబర్ వ్యాఖ్యానించాడు.
మ్యాచ్ అత్యంత కీలక దశలో 46వ ఓవర్‌లో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. హరీస్ రౌఫ్ వేసిన చివరి ఓవర్ చివరి బంతి వికెట్ల ముందు బ్యాట్స్‌మెన్ తబ్రైజ్ షమ్సీ ప్యాడ్స్‌ను తాకింది. ఔటేనేమో అనిపించింది. కానీ అంపైర్ ఔట్ ఇవ్వలేదు. దీంతో పాక్ ఆటగాళ్లు రివ్యూ తీసుకున్నారు. బంతి వికెట్లకు కొంచెం దూరంగా వెళ్లినట్టు ట్రాకర్‌లో గుర్తించి నాటౌట్‌గా నిర్ధారించారు. దీంతో పాక్ రివ్యూ కోల్పోయింది. ఫలితంగా షమ్సీ బతికిపోవడమే కాకుండా దక్షిణాఫ్రికా విజయం సాధించింది. అయితే నాటౌట్ అని తేలినప్పటికీ అంపైర్ ఔటిచ్చి ఉంటే తామే గెలిచేవాళ్లమని బాబర్ అనడం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.
ఇక ఈ ఓటమిని ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నామని బాబర్ విచారం వ్యక్తం చేశాడు. దీనిని జీర్ణించుకోలేకపోతున్నామన్నాడు. ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లు బాగా పోరాడారని మెచ్చుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు విజయం దక్కలేదని, డీఆర్ఎస్ కూడా ఆటలో భాగమేనని నిట్టూర్చాడు. మ్యాచ్ అనంతరం బాబర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.