Rassie van der Dussen: వాండర్ డస్సెన్ అవుట్ పై వివాదం.. స్పందించిన ఐసీసీ
- 19వ ఓవర్ లో ఉసామా మిర్ బంతికి చిక్కిన డస్సెన్
- ఎల్బీడబ్ల్యూగా ప్రకటించిన అంపైర్
- డీఆర్ఎస్ కు అప్పీల్ చేసిన దక్షిణాఫ్రికా
- రీప్లేలో రెండు రకాలుగా చూపించడంతో సందేహం
ఈ విడత ప్రపంచకప్ లో భాగంగా ఎన్నో వివాదాలు తలెత్తుతున్నాయి. దీంతో ఐసీసీ ఎన్నో విమర్శలు ఎదుర్కొంటోంది. నిన్న పాకిస్థాన్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన ఆసక్తికర పోరులో చివరికి దక్షిణాఫ్రికా విజయం సాదించింది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ లో రస్సీ వాండర్ డస్సెన్ ఎల్బీడబ్ల్యూపై వివాదం ఏర్పడింది. దీనిపై అభిమానులు సామాజిక మాధ్యమాల్లో ఐసీసీపై విమర్శలతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ అంశంపై ఐసీసీ స్పందించింది.
చెన్నైలో శుక్రవారం దక్షణాఫ్రికా-పాకిస్థాన్ తలపడ్డాయి. 19వ ఓవర్ లో పాక్ లెగ్ స్పిన్నర్ ఉసామా మిర్ సంధించిన బంతికి డస్సెన్ అవుటైనట్టు అంపైర్ పాల్ రీఫెల్ ప్రకటించారు. కళ్లతో చూస్తే బాల్ స్టంప్స్ ను దాటి వెళ్లినట్టు కనిపిస్తోంది. కానీ, అంపైర్ మాత్రం తనదైన దృష్టి కోణంలో అవుట్ గా ప్రకటించారు. దీనిపై డీఆర్ఎస్ కు డస్సెన్ అప్పీల్ చేశాడు. ఈ డీఆర్ఎస్ తో సందిగ్ధత మరింత పెరిగింది. రీప్లేలో మొదట చూపించిన దాని ప్రకారం బాల్ లెగ్ స్టంప్స్ కు ఆవలే ఉన్నట్టు కనిపిస్తోంది. అస్పష్టత నేపథ్యంలో కొన్ని సెకన్ల తర్వాత మరోసారి రీప్లే చేసి చూశారు. అందులో బాల్ పిచ్ లైన్ లోనే ఉన్నట్టు కనిపించింది. డీఆర్ఎస్ రీప్లేలో రెండు రకాలుగా చూపించడం చాలా అరుదు.
దీంతో రెండో రీప్లేను పరిగణనలోకి తీసుకున్న అంపైర్ అవుట్ గా నిర్ధారించారు. పర్యవసానంగా కేవలం 21 పరుగులకే డస్సెన్ వెనుదిరగక తప్పలేదు. నిన్నటి రసవత్తరమైన మ్యాచ్ లో ప్రతి వికెట్ చాలా కీలకంగా పనిచేసింది. మార్క్రమ్ మినహా టాపార్డర్ విఫలం కావడంతో దక్షిణాఫ్రికా విజయం కోసం చెరువు నీళ్లు తాగాల్సి వచ్చింది. డస్సెన్ అవుట్ తర్వాత రెండు రకాల డీఆర్ఎస్ రీప్లే ఫొటోలు సామాజిక మాధ్యమాల్లోకి చేరి వైరల్ గా మారాయి. ప్రసార మాధ్యమం, ఐసీసీపై దక్షిణాఫ్రికా అభిమానులు మండి పడుతున్నారు. దీనిపై ఐసీసీ స్పందించింది. డీఆర్ఎస్ కు సంబంధించి మొదటి గ్రాఫిక్ లో లోపం ఉందంటూ, ఆ తర్వాత సరైన గ్రాఫిక్ చూపించిందని, దీంతో అంతిమంగా సరైన నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది.