Haris Rauf: స్క్రీన్‌పై నాటౌట్ అని కనిపించగానే.. గుండె పగిలినంతపనై బాధతో కుప్పకూలిన రవూఫ్!

Pakistan Cricketers Left Heartbroken After Failed DRS Appeal vs South Africa

  • సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో ఘటన
  • షంషీ ఎల్బీడబ్ల్యూపై రివ్యూకు వెళ్లినా దక్కని ఫలితం
  • బాధతో కన్నీళ్లు పెట్టుకున్న రవూఫ్, రిజ్వాన్

ప్రపంచకప్‌లో భాగంగా గతరాత్రి సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ గెలుపు అంచుల్లోకి వచ్చి ఓటమి పాలైంది. మార్కరమ్ ఒంటరి పోరాటంతో 271 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా చచ్చీచెడీ సాధించింది. చివర్లో విజయానికి అవసరమైన 11 పరుగులను టెయిలెండర్స్ అయిన కేశవ్ మహరాజ్-తబ్రైజ్ షంషీ సాధించి జట్టును గట్టెక్కించారు. ఈ క్రమంలో షంషీ ఓ ఎల్బీ నుంచి తప్పించుకోవడం సఫారీలకు కలిసొచ్చింది. లేదంటే పాక్ గెలిచేదే. నిజానికి పాక్ గెలిచిందనే అనుకున్నారంతా.  

దక్షిణాఫ్రికా విజయానికి 8 పరుగులు అవసరమైన వేళ హారిస్ రవూఫ్ వేసిన 46వ ఓవర్ చివరి బంతికి షంషీ వికెట్ల ముందు దొరికిపోయాడు. ఫీల్డ్ అంపైర్ అవుటివ్వకపోవడంతో పాక్ రివ్యూకు వెళ్లినా నిరాశే ఎదురైంది. థర్డ్ అంపైర్ నిర్ణయంతో పాక్ ఆశలు అడియాసలు కావడంతో రవూఫ్ గుండె పగిలింది. బాధతో కూలబడిపోయాడు. కీపర్ రిజ్వాన్ కూడా తమాయించుకోలేక కన్నీటిని అదుపు చేసుకుంటూ రవూఫ్‌ను పట్టుకుని కూలబడ్డాడు. మరోవైపు, స్టాండ్స్‌లోని పాక్ అభిమానులు కూడా బాధతో కన్నీళ్లు పెట్టుకున్నంత పని చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

విజయానికి దగ్గరగా వచ్చి ఓడిపోవడం బాధనిపించిందని పాక్ కెప్టెన్ బాబర్ చెప్పుకొచ్చాడు. తమ తర్వాతి మూడు మ్యాచుల్లోనూ మరింత బాగా ఆడేందుకు ప్రయత్నిస్తామని తెలిపాడు. కాగా, ప్రపంచకప్‌లో ఓ జట్టు ఒక వికెట్ తేడాతో గెలవడం ఇది ఏడోసారి కాగా, సఫారీలకు ఇది రెండోసారి. 

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • Loading...

More Telugu News