questions: ప్రతి స్త్రీ పురుషుడిని అడగాల్సిన ముఖ్యమైన ప్రశ్నలు!
- భవిష్యత్ లక్ష్యాల గురించి తెలుసుకోవాలి
- ఆర్థిక విషయాల్లో ఇరువురికీ భాగస్వామ్యం
- కష్టాలు ఎదురైతే గట్టెక్కే మార్గాలేంటి?
- ఒకరి నుంచి మరొకరు ఆశిస్తున్న దానిపై స్పష్టత ఉండాలి
కాబోయే జీవిత భాగస్వాముల మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదు. ఎంతో పారదర్శకంగా ఉండడం ద్వారా వారు తమ బంధాన్ని చిరకాలం కొనసాగించుకునేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. తనకు ఇష్టమైన వాడైనా, కాబోయే జీవిత భాగస్వామి అయినా మహిళ తప్పకుండా అడగాల్సిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను నిపుణులు తెలియజేస్తున్నారు.
భవిష్యత్ లక్ష్యాలు ఏంటి?
అబ్బాయిల జీవిత లక్ష్యాల గురించి అడిగేందుకు చాలా మంది యువతులు వెనుకాడుతారు. అలా అడిగితే ఒత్తిడికి గురవుతారని, కోపం తెచ్చుకుంటారని సందేహిస్తుంటారు. తమ అనుబంధంపై ప్రభావం పడుతుందేమోనన్న భయం కూడా వేధిస్తుంది. నిజానికి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే వారి కంటే పారిపోయే అబ్బాయిలే ఎక్కువ. అబ్బాయి జీవిత లక్ష్యాలు, దీర్ఘకాలిక లక్ష్యాలు ఏంటో ముందుగానే తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. దీనివల్ల ఇద్దరి మధ్య సామీప్యత, స్పష్టతకు అవకాశం ఉంటుంది. ముందే అంచనాకు రావచ్చు.
రిషేషన్ షిప్ గురించి అభిప్రాయం ఏంటి?
మన అనుబంధం గురించి ఏమనుకుంటున్నావు? ఇది కూడా అడగాల్సిన ప్రశ్నే. దీనివల్ల వివాదం ఏర్పడుతుందా? మనస్పర్థలు వస్తాయా? అని సంకోచించొద్దు. ఎందుకంటే ఇద్దరి మధ్య దాపరికాలు లేని, పారదర్శకమైన ఆలోచనలే బంధానికి బలమైన పునాదులు అవుతాయి. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన అనుబంధానికి ఈ మాత్రం స్పష్టత అవసరం.
నా నుంచి ఏమి కోరుకుంటున్నావు?
భావోద్వేగంగా, వాస్తవికంగా నా నుంచి ఏమి కోరుకుంటున్నావు? అని అడగడం కూడా అవసరమే. దీనివల్ల ఒకరి మనసు కోరుకుంటున్నవి మరొకరికి ముందే తెలుస్తాయి. ఇద్దరూ ఒకరికి ఒకరు తోడుగా ఉండడానికి ఇవి బలంగా నిలుస్తాయి.
కష్టాలను ఎలా జయిస్తావు?
కష్టాలు పలకరించినప్పుడు, సవాళ్లు ఎదురైనప్పుడు, క్లిష్ట పరిస్థితులను ఎలా ఎదుర్కొంటావు? అని ముందే అడగడం కొంచెం కష్టమైన ప్రశ్నే. కాకపోతే ఇలా అడగడం వల్ల కష్ట సమయాలను ఎలా గట్టెక్కవచ్చన్న దానిపై ఒకరి వ్యూహాల గురించి స్పష్టత ఏర్పడుతుంది. ఒకరికొకరు తోడుగా నిలిచేందుకు దారి చూపిస్తుంది.
డబ్బు గురించి మాట్లాడుకుందామా?
దంపతుల మధ్య డబ్బు విషయాలు సున్నితమైనవి. డబ్బు ప్రస్తావన తెస్తే, గొడవలు ఏర్పడతాయన్న భయం ఉండొచ్చు. కానీ కలిసి నడిచే వారి మధ్య ఆర్థికపరమైన విషయాల్లో తప్పకుండా భాగస్వామ్యం ఉండాలి. పారదర్శకత ఉండాలి. ఇద్దరూ కలసి ప్రణాళిక రూపొందించుకోవడం ద్వారా ఆర్థిక స్వేచ్ఛను సొంతం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఇంటి పనుల్లో పాత్ర?
ఇంటి పనుల్లో నీ పాత్ర ఎంత మేరకు ఉంటుంది? ఏ విషయాల్లో సాయంగా ఉంటావు? అని మహిళ ప్రశ్నించడం తప్పు లేదు. ఎందుకంటే బాధ్యతలన్నీ ఒకరి నెత్తిపైనే వేయడం కంటే, ఇద్దరూ సమానంగా పంచుకున్నప్పుడే సౌకర్యంగా ఉంటుంది.