Australia: ధర్మశాలలో ఆసీస్ ఓపెనర్ల విధ్వంసం... కివీస్ ముందు కొండంత లక్ష్యం
- ధర్మశాలలో ఆసీస్ × కివీస్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్
- 49.2 ఓవర్లలో ఆసీస్ 388 ఆలౌట్
- హెడ్ సెంచరీ... వార్నర్ అర్ధసెంచరీ
- 23.2 ఓవర్లలోనే 200 పరుగులు చేసిన ఆసీస్
- ధాటిగా ఆడిన మ్యాక్స్ వెల్, కమిన్స్, ఇంగ్లిస్
వరల్డ్ కప్ లో ఇవాళ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49.2 ఓవర్లలో 388 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్ తొలి వికెట్ కు 175 పరుగులు జోడించి కివీస్ బౌలర్లను హడలెత్తించారు.
గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన హెడ్ సెంచరీతో తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. ఈ ఎడమచేతివాటం బ్యాట్స్ మన్ సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. 67 బంతులాడిన హెడ్ 10 ఫోర్లు, 7 సిక్సర్లతో 109 పరుగులు చేశాడు. మరో ఎండ్ లో వార్నర్ సైతం తగ్గేదే లే అంటూ తన ట్రేడ్ మార్క్ షాట్లతో కివీస్ బౌలర్లను కకావికలం చేశాడు. వార్నర్ 65 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సులతో 81 పరుగులు చేశాడు.
ట్రెంట్ బౌల్ట్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గుసన్ వంటి ప్రధాన పేసర్లు, మిచెల్ శాంట్నర్ వంటి స్టార్ స్పిన్నర్ కూడా హెడ్, వార్నర్ బాదుడుకు బలయ్యారు. అయితే పార్ట్ టైమ్ బౌలర్ గ్లెన్ ఫిలిప్స్ రంగప్రవేశంతో ఆసీస్ దూకుడుకు కళ్లెం పడింది. గ్లెన్ ఫిలిప్స్... ఆసీస్ ఓపెనర్లిద్దర్నీ అవుట్ చేయడమే కాదు, కీలకమైన స్టీవెన్ స్మిత్ (18) వికెట్ కూడా పడగొట్టాడు. 18 పరుగులు చేసిన మార్నస్ లబుషేన్ ను మిచెల్ శాంట్నర్ అవుట్ చేశాడు.
ఆసీస్ స్కోరు 23.2 ఓవర్లకే 200 మార్కు చేరుకున్నప్పటికీ, మిడిల్ ఓవర్లలో వికెట్లు కోల్పోవడంతో కాస్త జోరు తగ్గింది. అయితే, చివర్లో మళ్లీ పుంజుకున్న ఆసీస్ భారీ స్కోరు సాధించగలిగింది. గ్లెన్ మ్యాక్స్ వెల్ తనదైన శైలిలో ధనాధన్ బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచాడు. మ్యాక్స్ వెల్ 24 బంతుల్లోనే 5 ఫోర్లు, 2 సిక్సులతో 41 పరుగులు చేయగా, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ జోష్ ఇంగ్లిస్ 28 బంతుల్లో 38 పరుగులు చేశాడు.
ఇక, ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ బ్యాట్ తో చెలరేగాడు. కమిన్స్ కేవలం 14 బంతుల్లోనే 2 ఫోర్లు, 4 సిక్సులతో చకచకా 37 పరుగులు చేయడం విశేషం. ఆఖర్లో ట్రెంట్ బౌల్ట్ ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసి ఆసీస్ స్కోరు 400 చేరకుండా కట్టడి చేశాడు. కివీస్ బౌలర్లలో గ్లెన్ ఫిలిప్స్ 3, ట్రెంట్ బౌల్ట్ 3, మిచెల్ శాంట్నర్ 2, మాట్ హెన్రీ 1, జిమ్మీ నీషామ్ 1 వికెట్ తీశారు.