South Africa: విజయం తర్వాత 'జై శ్రీ హనుమాన్' అంటూ దక్షిణాఫ్రికా క్రికెటర్ పోస్ట్
- బౌండరీతో విజయం ఖరారు చేసిన కేశవ్ మహరాజ్
- విజయం తర్వాత ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్
- కేశవ్ పూర్వీకులు భారత్ నుంచి వలస వెళ్లిన వారే
చెన్నై వేదికగా దక్షిణాఫ్రికా-పాకిస్థాన్ మ్యాచ్ చివరి వరకు ఆసక్తిగా సాగింది. పాకిస్థాన్ నిర్దేశించిన 270 పరుగుల లక్ష్యం చిన్నదే. దీంతో దక్షిణాఫ్రికా సులభంగానే గెలుపు సాధిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ, ఓపెనర్లు విఫలం కావడం, మిడిలార్డర్ (మార్క్రమ్) కూడా ఆశలు వమ్ము చేయడంతో ఫలితం పాక్ వైపు మొగ్గుతోందన్న అంచనాలు ఏర్పడ్డాయి. కానీ అనూహ్యంగా దక్షిణాఫ్రికాయే చివరికి విజయం సాధించింది.
చేతిలో ఓవర్లు మిగిలి ఉన్నాయి. చేయాల్సిన రన్ రేటు కూడా ఓవర్ కు రెండు పరుగులే. కానీ వికెట్లే లేవు. చివరి మూడు వికెట్లు, 30 పరుగులు మిగిలి ఉండగా ఉన్న పరిస్థితి అది. ఈ సమయంలోనే మార్క్రమ్ అవుట్ కావడం, లుంగిడి ఎండిగి కూడా వెంటనే వెళ్లిపోవడంతో చివరికి కేశవ్ మహరాజ్, షమ్సి డిఫెన్స్ ప్లే చేశారు. కేశవ్ మహరాజ్ అయితే 21 బంతులు ఎదుర్కొని 7 పరుగులే చేశాడు. ఈ ఏడు పరుగుల్లో కేశవ్ కొట్టిన బౌండరీ దక్షిణాఫ్రికాకు విజయాన్నిచ్చింది. దీంతో అతడు గుండెలు చరుచుకుంటూ మైదానంలో తెగ సంబరపడిపోయాడు.
మ్యాచ్ తర్వాత కేశవ్ మహరాజ్ ఇన్ స్టా గ్రామ్ లో పెట్టిన ఒక పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ‘‘దేవుడి పట్ల నాకు నమ్మకం ఉంది. కుర్రాళ్లు ఎంత చక్కని ఫలితం సాధించారు? షమ్సి, మార్క్రమ్ ప్రదర్శన చూడ్డానికి అద్భుతంగా ఉంది. జై శ్రీ హనుమాన్’’ అని పేర్కొన్నాడు. కేశవ్ మహరాజ్ మూలాలు భారత్ లోనే ఉన్నాయి. అతడి పూర్వీకులు 1874లో దక్షిణాఫ్రికాకు వలసపోయారు. అతడి తల్లిదండ్రులు ఆత్మానంద్, కాంచనమాల.