Lunar Eclipse: నేడు చంద్రగ్రహణం... భారత్ లో ఏ సమయంలో కనిపిస్తుందంటే...!
- భారత్ సహా ఆసియా, యూరప్, ఆఫ్రికా దేశాల్లో పాక్షిక చంద్రగ్రహణం
- నేటి రాత్రి 11.31 గంటలకు గ్రహణం ప్రారంభం
- రాత్రి 1.44 గంటలకు స్పష్టంగా కనిపించనున్న గ్రహణం
నేడు చంద్ర గ్రహణం ఏర్పడనుంది. భారత్ తో పాటు ఇతర ఆసియా దేశాలు, యూరప్, ఆఫ్రికా దేశాల్లో ఈ రాత్రికి పాక్షిక చంద్ర గ్రహణం దర్శనమివ్వనుంది. ఈ ఖగోళ ఘట్టం నేటి రాత్రి మొదలై అక్టోబరు 29వ తేదీ వేకువ జాము వరకు కొనసాగుతుందని ప్రముఖ ఖగోళ పరిశోధకుడు దేవీ ప్రసాద్ దువారీ వెల్లడించారు.
భారత్ లో ఈ రాత్రి 11.31 గంటలకు చంద్ర గ్రహణం ప్రారంభం కానుంది. అర్ధరాత్రి దాటిన తర్వాత 1.05 గంటల సమయంలో గ్రహణం బాగా కనిపిస్తుందని, 1.44 గంటల సమయంలో చంద్ర గ్రహణాన్ని స్పష్టంగా గుర్తించవచ్చని దువారీ తెలిపారు. 2.23 గంటల సమయానికి చంద్ర గ్రహణం ముగుస్తుందని వివరించారు.