Anand Mahindra: నీకు ఏ కారు కావాలంటే అది తీసుకో తల్లీ... పారా ఆర్చర్ ప్రతిభకు ఆనంద్ మహీంద్రా ఫిదా
- పారా ఆసియా క్రీడల్లో శీతల్ దేవి ప్రతిభ
- ఆర్చరీలో స్వర్ణం
- రెండు చేతులు లేకపోయినా అస్త్ర విన్యాసం
- ఫైనల్లో అద్భుత ప్రతిభతో విజేతగా నిలిచిన జమ్మూ కశ్మీర్ బాలిక
విలు విద్యకు చేతులు ఎంతో ముఖ్యమైనవి. కానీ రెండు చేతులు లేని శీతల్ దేవి పారా ఏషియన్ గేమ్స్ లో ఆర్చరీ స్వర్ణం గెలిచింది. ఎక్కడా గురి తప్పకుండా గోల్డ్ మెడల్ సాధించింది. రెండు చేతులు ఉన్నవాళ్లే అంత కచ్చితత్వంతో మెడల్ గెలిచేందుకు ఎంతో ప్రయాసపడతారు. కానీ రెండు చేతులు లేకుండా, కేవలం కాళ్లతోనే విల్లు ఎక్కుపెట్టిన ఆ బాలిక ప్రతిభకు దేశవ్యాప్తంగా జేజేలు పలుకుతున్నారు. ఇంతజేసీ శీతల్ దేవి వయసు 16 ఏళ్లే. కానీ ఆమె నైపుణ్యం అపారం!
జమ్మూ కశ్మీర్ లోని కిస్త్వాడ్ జిల్లా లోయిధర్ గ్రామం ఆమె స్వస్థలం. పారా ఆసియా క్రీడల్లో మహిళల ఇండివిడ్యువల్ కాంపౌండ్ కేటగిరీలో శీతల్ స్వర్ణం చేజిక్కించుకుని, రెండు చేతులు లేకుండా ఆర్చరీ స్వర్ణం నెగ్గిన తొలి మహిళా ఆర్చర్ గా అరుదైన ఘనత సాధించింది.
ఆ బాలిక నైపుణ్యానికి ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా అంతటివాడే అచ్చెరువొందారు. ఆయన ఎక్స్ లో స్పందించిన తీరు చూస్తే ఎంతలా ముగ్ధులయ్యారో అర్థమవుతుంది.
"శీతల్ దేవిని చూశాక... ఇక నేను ఎప్పటికీ నా జీవితంలోని చిన్న చిన్న సమస్యల పట్ల ఫిర్యాదు చేయబోను. శీతల్ దేవీ... నువ్వు మా అందరికీ గురువు తల్లీ. మా కంపెనీ తయారుచేసే ఏ కారు కావాలంటే అది తీసుకోమ్మా. ఆ కారును నీకు బహూకరిస్తాం. అంతేకాదు, నీకు అనుగుణంగా ఆ కారులో మార్పులు చేర్పులు కూడా చేయిస్తాం" అని ఆనంద్ మహీంద్రా భావోద్వేగాలతో ట్వీట్ చేశారు.