Nederlands: వరల్డ్ కప్ లో మరో సంచలనం నమోదు చేసిన నెదర్లాండ్స్
- కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ మ్యాచ్
- మొదట 50 ఓవర్లలో 229 పరుగులకు నెదర్లాండ్స్ ఆలౌట్
- లక్ష్యఛేదనలో 142 పరుగులకే కుప్పకూలిన బంగ్లాదేశ్
వరల్డ్ కప్ లో ఇటీవలే బలమైన దక్షిణాఫ్రికా జట్టును ఓడించి సంచలనం సృష్టించిన నెదర్లాండ్స్ జట్టు, తాజాగా మరో ఘనవిజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఇవాళ కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్ లో నెదర్లాండ్స్ జట్టు 87 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ జట్టును చిత్తు చేసింది.
ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆరెంజ్ ఆర్మీ 50 ఓవర్లలో 229 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ 68 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఎంగెల్ బ్రెక్ట్ 35, వాన్ బీక్ 23 (నాటౌట్) పరుగులు చేశారు.
230 పరుగుల టార్గెట్ అంటే... బంగ్లాదేశ్ వంటి జట్టుకు ఏమంత కష్టసాధ్యం కాదు. కానీ, ఎంతో పట్టుదలతో ఉన్న నెదర్లాండ్స్... లక్ష్యఛేదనకు బరిలో దిగిన బంగ్లాదేశ్ ను హడలెత్తించింది. మ్యాచ్ లో ఏ దశలోనూ గెలుపు దిశగా సాగుతున్నట్టు కనిపించని బంగ్లా జట్టు చివరికి 42.2 ఓవర్లలో 142 పరుగులకు కుప్పకూలింది. డచ్ జట్టులో పాల్ వాన్ మీకెరెన్ 4 వికెట్లతో సత్తా చాటాడు. బాస్ డీ లీడ్ 2, ఆర్యన్ దత్ 1, లోగాన్ వాన్ బీక్ 1, కోలిన్ అకెర్ మన్ 1 వికెట్ తీశారు.
బంగ్లా ఇన్నింగ్స్ లో మెహిదీ హసన్ మిరాజ్ 35, మహ్మదుల్లా 20, ముస్తాఫిజూర్ రెహ్మాన్ 20 పరుగులు చేశారు. ఓపెనర్లు లిట్టన్ దాస్ (3), టాంజిద్ హుస్సేన్ (15) కేవలం 19 పరుగుల స్కోరుకే వెనుదిరిగారు. ఆ తర్వాత నజ్ముల్ హుస్సేన్ శాంటో (9), కెప్టెన్ షకీబ్ అల్ హసన్ (5), ముష్ఫికర్ రహీమ్ (1) పేలవంగా ఆడారు.
70 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ ను మహ్మదుల్లా, మహేదీ హసన్, తస్కిన్ అహ్మద్ ముస్తాఫిజూర్ రెహ్మాన్ లతో కూడిన లోయరార్డర్ ఆదుకునే ప్రయత్నం చేసినా అది కాసేపే అయింది. ఈ విజయంతో నెదర్లాండ్స్ పాయింట్ల పట్టికలో 8వ స్థానానికి చేరింది. తాజా ఓటమితో బంగ్లాదేశ్ 9వ స్థానానికి పడిపోయింది.