TDP: తెలంగాణలో పోటీ వద్దన్న టీడీపీ అధిష్ఠానం... పోటీ చేయాల్సిందేనంటున్న నేతలు!
- నవంబరు 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు
- ఈసారికి పోటీ చేయరాదని టీడీపీ హైకమాండ్ నిర్ణయం
- అధిష్ఠానం నిర్ణయాన్ని నేతలకు తెలియజేసిన తెలంగాణ టీడీపీ చీఫ్ కాసాని
- ససేమిరా అన్న తెలంగాణ టీడీపీ నేతలు
- నేతల అభిప్రాయాన్ని పార్టీ అధిష్ఠానానికి వివరిస్తానని కాసాని వెల్లడి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు తెర లేచిన సంగతి తెలిసిందే. నవంబరు 30న పోలింగ్ జరగనుంది. అన్ని ప్రధాన పార్టీలు సమరోత్సాహంతో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. కొన్నాళ్ల కిందట ఖమ్మం, హైదరాబాదు సభలతో తెలంగాణ టీడీపీలోనూ కొత్త ఆశలు రేకెత్తాయి. దాంతో, ఈసారి ఎన్నికల్లో బరిలో దిగేందుకు తెలంగాణ టీడీపీ నేతలు సిద్ధమయ్యారు.
అయితే, తెలంగాణ ఎన్నికల్లో పోటీ వద్దంటూ టీడీపీ అధిష్ఠానం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, తెలంగాణ టీడీపీ నేతలతో రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ సమావేశమయ్యారు. ఎన్నికల్లో పోటీ చేయొద్దంటూ పార్టీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన నేతలకు వివరించారు.
కానీ, తెలంగాణ టీడీపీ నేతలు ససేమిరా అన్నారు. ఈసారి ఎన్నికల బరిలో దిగాల్సిందేనని స్పష్టం చేశారు. దాంతో కాసాని జ్ఞానేశ్వర్ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు. అటు పార్టీ హైకమాండ్ ఆదేశాలను దాటి వెళ్లలేక, ఇటు పార్టీ నేతలను బుజ్జగించలేక భావోద్వేగాలకు లోనయ్యారు. ఎన్నికల్లో పోటీపై మరోసారి పార్టీ హైకమాండ్ తో చర్చిస్తానని తెలంగాణ టీడీపీ నేతలకు సర్దిచెప్పారు.