Ola: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లో మంటలు.. కంపెనీ వివరణ ఇదీ..!
- పూణెలోని ఓ కాలేజీ ఆవరణలో కాలిపోయిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్
- మార్కెట్లో లభించే విడిభాగాల వాడకం వల్లే ప్రమాదం జరిగినట్టు ఓలా ప్రకటన
- కంపెనీ అసలైన విడిభాగాలనే ఉపయోగించాలని కస్టమర్లకు సూచన
చాలా కాలం తర్వాత మరో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ లో మంటలు చెలరేగాయి. ఇది పూణెలో చోటు చేసుకుంది. రెండేళ్ల క్రితం కూడా పలు ఓలా స్కూటర్లలో అగ్ని ప్రమాదాలు జరగడం గుర్తుండే ఉంటుంది. అప్పుడు ఓలా అనే కాకుండా, పలు ఇతర కంపెనీల ఎలక్ట్రిక్ స్కూటర్లలోనూ ఇలాంటి ప్రమాదాలే చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత బ్యాటరీల విషయంలో నిబంధనలను కేంద్రం కఠినతరం చేసింది. దీంతో కంపెనీలు సైతం ప్రమాణాలను పెంచాయి. ఆ తర్వాత ప్రమాదాలు పెద్దగా చోటు చేసుకోకపోవడంతో వాహనదారులు ఊపిరిపీల్చుకున్నారు. తాజా ప్రమాదం మరోసారి వాహనదారులను ఉలిక్కిపడేలా చేసింది.
ఈ నెల 28న పూణెలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అగ్నికి ఆహుతైంది. డీవై పాటిల్ కాలేజీ ఆవరణలో పార్క్ చేసి ఉన్న సమయంలో ప్రమాదం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ ట్విట్టర్ లోకి చేరడంతో అది పెద్ద వైరల్ గా మారిపోయింది. బ్యాటరీ నుంచి తలెత్తిన మంటలే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. దీనిపై ఓలా ఓ ప్రకటన విడుదల చేసింది.
‘‘పూణెలో మా స్కూటర్ ఒకటి ప్రమాదానికి గురైనట్టు సమాచారం అందింది. కస్టమర్ సురక్షితంగా ఉన్నారు. బయట కొనుగోలు చేసిన విడిభాగాలను వాడడం వల్ల, షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగినట్టు మా విచారణలో తేలింది. వాహనంలో బ్యాటరీ బాగానే పనిచేస్తున్నట్టు తెలిసింది. ఓలాకు సంబంధించినంత వరకు భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. మేము చాలా కఠినమైన భద్రత, నాణ్యతా ప్రమాణాలను పాటిస్తాం. కనుక కస్టమర్లు ఓలాకు సంబంధించి అసలైన విడిభాగాలనే ఉపయోగించుకోవాలని కోరుతున్నాం’’ అంటూ ఓలా తన ప్రకటనలో పేర్కొంది.