G. Kishan Reddy: టీఎస్పీఎస్సీ సంబంధం లేదన్న కేటీఆర్ ఇప్పుడు ప్రక్షాళన ఎలా చేస్తారు?: కిషన్ రెడ్డి
- ఇన్నాళ్లు అధికారంలో ఉండి ఎందుకు ప్రక్షాళన చేయలేదు? అని ప్రశ్న
- కేటీఆర్ పగటి కలలు కనడం ఆపాలన్న కేంద్రమంత్రి
- నిరుద్యోగులకు మేలు చేయాలనే ఆలోచన కేసీఆర్ ప్రభుత్వానికి లేదని విమర్శ
నెల రోజుల క్రితం టీఎస్పీఎస్సీతో తనకేం సంబంధం అన్న వ్యక్తి ఈ రోజు మాత్రం డిసెంబర్ 3 తర్వాత ప్రక్షాళన చేస్తానని ఎలా చెబుతారు? అని మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కేటీఆర్ ఇప్పటికైనా పగటి కలలు కనడం మానుకోవాలన్నారు.
నిరుద్యోగులకు మేలు చేయాలనే ఆలోచన కేసీఆర్ ప్రభుత్వానికి ఏమాత్రం లేదన్నారు. చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికే ఉద్యోగాలు భర్తీ చేసేవారన్నారు. ప్రభుత్వం అసమర్థత వల్ల వరుసగా పేపర్లు లీక్ అయ్యాయని మండిపడ్డారు. దీంతో ఉద్యోగాల భర్తీ జరగలేదన్నారు. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని కేటీఆర్ ఇప్పుడు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇన్నాళ్లు అధికారంలో ఉండి ఏం చేశారన్నారు.