Raghunandan Rao: కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడితో నాకు సంబంధం లేదు: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు
- ప్రజాస్వామ్యంలో ఎలాంటి హింసకు తావులేదన్న రఘునందనరావు
- సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆవేదన
- క్రిటికల్ కేర్ యూనిట్‌లో కొత్త ప్రభాకర్ రెడ్డి
- దాడిని ఖండించిన కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి
మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో సామాజిక అనుసంధాన వేదికలో తప్పుడు ప్రచారం సాగుతోందని దుబ్బాక ఎమ్మెల్యే, బీజేపీ నేత రఘునందన్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనపై దాడికి, తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ప్రజాస్వామ్యంలో ఎలాంటి హింసకు తావులేదని వ్యాఖ్యానించారు. దాడికి పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలన్నారు. దాడికి పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి విషయంలో పోలీస్ కమిషనర్ శ్వేత వ్యాఖ్యల వల్ల తమ పార్టీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
స్వామి అనే తమ పార్టీ కార్యకర్తను మఫ్టీ పోలీసులు తీసుకెళ్లారని, నవీన్ అనే మరో కార్యకర్తపై దాడి జరిగిందన్నారు. మా కార్యకర్తలపై జరిగే దాడికి పోలీసులు వెంటనే స్పందించాలని లేదంటే రేపు ఉదయం తాను కార్యాలయానికి వచ్చి రాతపూర్వక ఫిర్యాదు చేస్తానని చెప్పారు. పోలీస్ కమిషనర్... ముఖ్యమంత్రి, మంత్రి జిల్లాలో పని చేస్తున్నారని అందుకే వారి అడుగులకు మడుగులొత్తుతున్నారని ఆరోపించారు. తమ కార్యకర్తల ఇల్లు, దుకాణాలపై దాడులు జరుగుతుంటే, వారిని కొడుతుంటే పోలీసులు మౌనంగా చూస్తున్నారని ధ్వజమెత్తారు. సీపీ అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారన్నారు. సిద్దిపేట సీపీపై వారం రోజుల క్రితం డీజీపీకి ఫిర్యాదు చేశామన్నారు.
ఈ దాడి దురదృష్టకరమని, బాధాకరమన్నారు. తాను పాలమూరు నుంచి నేరుగా ఆసుపత్రికి వెళ్లి కొత్త ప్రభాకర్ రెడ్డిని పరామర్శిస్తానని చెప్పారు. నిందితుడు రాజు జై కాంగ్రెస్, జై మిరుదొడ్డి మండలం అని ఫేస్ బుక్‌లో స్టేటస్ పెట్టుకున్నారన్నారు. వీహెచ్‌తో దిగిన ఫోటోలు ఉన్నాయన్నారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి సీపీ పూర్తి వివరాలు వెల్లడిస్తే బాగుండేదన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించరు. తనకు దళితబంధు రాలేదనే ఆవేదనతో దాడికి పాల్పడినట్లు కొన్ని ప్రసార మాద్యమాల్లో వస్తోందన్నారు. కార్యకర్తలు అందరూ సంయమనం పాటించాలన్నారు. నిందితుడు రాజు మద్యం మత్తులో ఉన్నాడని, కుటుంబ సభ్యులతో కలహాలు ఉన్నాయని కూడా మీడియాలో వార్తలు వస్తున్నాయన్నారు. నిందితుడు రాజు బీజేపీ కండువా కప్పుకున్నట్లుగా ప్రచారం సాగుతోందని, ఆ ఫోటో అతనిది కాదని, పొడేటి నర్సింహులు అనే మరో వ్యక్తి అన్నారు.
కాగా, దాడి చేసిన రాజు అనే వ్యక్తి ఇటీవలి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉండి, కొన్ని రోజుల క్రితం బీజేపీలో చేరినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. దీంతో రఘునందనరావు స్పందించారు.
దాడిని ఖండించిన కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి
కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఖండించారు. ప్రజాస్వామ్యంలో దాడులకు తావు లేదన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా దాడిని ఖండించారు. ఈ దాడిపై పారదర్శక విచారణ జరగాలన్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ హింసను నమ్ముకోలేదన్నారు. దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేయాలన్నారు.
క్రిటికల్ కేర్ యూనిట్‌లో కొత్త ప్రభాకర్ రెడ్డి
కొత్త ప్రభాకర్ రెడ్డిని యశోద ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ యూనిట్‌లో ఉంచారు. ఆయనకు బలమైన గాయం అయినట్లుగా వైద్యులు గుర్తించారు. మూడంగుళాల మేర గాయమైనట్లు గుర్తించారు.
కొత్త ప్రభాకర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని మంత్రి హరీశ్ రావు ఆకాంక్షించారు. ప్రస్తుతం ఆపరేషన్ జరుగుతోందని, శరీరంలో అంతర్గత రక్తస్రావం అయినట్లు వైద్యులు గుర్తించారన్నారు. రెండు గంటల పాటు ఆపరేషన్ చేస్తారన్నారు. హత్యా రాజకీయాలు సరికాదని, ఏది ఉన్నా ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలన్నారు. మంత్రి జగదీశ్ రెడ్డి యశోద ఆసుపత్రికి చేరుకొని పరామర్శించారు.
మరోవైపు, యశోద ఆసుపత్రి వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ప్రతిపక్ష పార్టీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దుబ్బాకలో బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు.