kasani gyaneshwar mudhiraj: అలాంటప్పుడు నేను ఎందుకు?: తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా
- అసెంబ్లీ బరిలో తెలంగాణ టీడీపీ ఉండాలని భావించిన కాసాని
- అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించిన పార్టీ అధిష్ఠానం
- త్వరలో కాసాని జ్ఞానేశ్వర్ భవిష్యత్తుపై ప్రకటన చేసే అవకాశం
తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తన పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో ఉండాలని కాసాని భావించారు. కానీ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో కాసాని తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. త్వరలో ఆయన తన భవిష్యత్తుపై ప్రకటన చేయనున్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి కేడర్ ఉంది. టీడీపీ పోటీ చేస్తే చాలా నియోజకవర్గాల్లో సత్తా చాటుతుందని కాసానితో పాటు తెలంగాణ టీడీపీ నేతలు భావిస్తున్నారు. కానీ పోటీకీ అధిష్ఠానం నో చెప్పడంతో కాసాని తీవ్ర నిర్ణయం తీసుకున్నారు.
ఈ సందర్భంగా కాసాని మాట్లాడుతూ... పార్టీ నాయకులు ఎవరైనా పోటీలో నిలబడాలని చూస్తారని, కానీ ఓ వర్గం కాంగ్రెస్ పార్టీకి జై అనే వాదన తెరపైకి తెచ్చిందన్నారు. కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని ఓ వర్గం చెబుతోందని, అందులో చౌదరీలు ఉన్నారన్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉండగా దానిని నిలబెట్టుకోకపోగా... కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తామని చెప్పడం ఏమిటన్నారు. అలాంటప్పుడు టీడీపీ ఎందుకు? అధ్యక్షుడిగా నేను ఎందుకు? అందుకే రాజీనామా చేస్తున్నానన్నారు.