Nara Lokesh: చంద్రబాబుపై మద్యం అనుమతుల కేసు... తీవ్రస్థాయిలో స్పందించిన లోకేశ్
- చంద్రబాబుపై నాలుగో కేసు నమోదు చేసిన సీఐడీ
- మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతిచ్చారంటూ ఆరోపణలు
- కక్ష సాధింపునకు మరో రూపం జగన్ అంటూ లోకేశ్ విమర్శలు
- కక్ష సాధింపు తగ్గేందుకు మందులు వాడాలని హితవు
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వం మద్యం అనుమతుల కేసు నమోదు చేయడంపై నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కక్ష సాధింపునకు మరో రూపమే జగన్ అని మండిపడ్డారు. కక్ష సాధింపులో నువ్వు ఆంధ్రా గోల్డ్, ప్రెసిడెంట్ మెడల్ బ్రదర్ అంటూ ఘాటుగా స్పందించారు. పిచ్చికి వాడుతున్నట్టే, కక్ష సాధింపు ధోరణికి కూడా మందులు వాడాలని అన్నారు.
రాష్ట్రంలో నాసిరకం మద్యం తాగి 35 లక్షల మంది రోగాల బారినపడ్డారని, 30 వేల మంది ప్రాణాలు కోల్పోయారని లోకేశ్ వెల్లడించారు. ఎవరి హయాంలో లిక్కర్ దందా జరుగుతోందో చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. మందుబాబుల తిట్లు వినే ధైర్యం జగన్ కు ఉందా? అని ప్రశ్నించారు.
ఇదంతా రాజకీయ కుట్ర అని, జగన్ డైవర్షన్ జిత్తుల్లో భాగమే ఇదంతా అని మండిపడ్డారు. జగన్ పాలనలో రూ.లక్ష కోట్ల మద్యం కుంభకోణం జరిగిందని ఆరోపించారు. నాసిరకం మద్యం పోసి ప్రజల ప్రాణాలు తీస్తున్నారని విమర్శించారు. దీనిపై విచారణ జరపాలని బీజేపీ నేతలు ఇప్పటికే కేంద్రానికి ఫిర్యాదు చేశారని అచ్చెన్న తెలిపారు.