kotha prabhakar reddy: కొత్త ప్రభాకర్ రెడ్డి మీద హత్యాయత్న ఘటనపై స్పందించిన వినోద్ కుమార్
- ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి చర్యలు మంచివి కావన్న వినోద్ కుమార్
- కొత్త ప్రభాకర్ రెడ్డి మీద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటన
- బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్
మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి మీద హత్యాయత్నం జరగడంపై తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ స్పందించారు. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి చర్యలు ఏమాత్రం మంచివి కాదన్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. బాధ్యులు ఎవరైనా చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభాకర్ రెడ్డి సౌమ్యుడని.. ప్రజాసేవకు అంకితమైన గొప్ప వ్యక్తి అన్నారు. అలాంటి వ్యక్తిపై హత్యాయత్నం జరగడం ఆవేదనకు గురి చేసిందన్నారు.
ఆషామాషీగా చూడవద్దు... తలసాని
ఈ దాడిని ఆషామాషీగా చూడవద్దని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇది చాలా పెద్ద ఘటన అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఇలాంటి దాడి ఇదే మొదటిసారి అన్నారు. ఎన్నికల కమిషన్ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలన్నారు. అభ్యర్థులకు ఎన్నికల కమిషన్ భద్రత కల్పించాలని కోరారు. ఈ దాడి నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థుల్లో భయాందోళనలు కనిపిస్తున్నాయన్నారు.