Cricket: భారత్‌లో విదేశీ పరిస్థితులే పాకిస్థాన్ ఓటములకు కారణం: పాక్ కోచ్
- మ్యాచ్ ఆడే ప్రతి వేదికా కొత్తదేనని వ్యాఖ్య
- ఆటగాళ్లలో ఎవరూ ఇంతకుముందు ఇక్కడ ఆడలేదన్న బ్రాడ్‌బర్న్
- బంగ్లాపై కీలక మ్యాచ్‌కు ముందు ప్రెస్మీట్లో అభిప్రాయం
భారత్‌లో ‘విదేశీ పరిస్థితులు’, ఇక్కడి వేదికలపై అవగాహన లేకపోవడమే పాకిస్థాన్ వరుస ఓటములకు కారణమని ఆ జట్టు కోచ్ గ్రాంట్ బ్రాడ్‌బర్న్ అన్నారు. కొత్త పరిస్థితులున్న దేశంలో ఈ టోర్నమెంట్ ఆడుతున్నట్టుగా ఉందని, తమ ఆటగాళ్లలో ఎవరూ ఇంతకుముందు ఇక్కడ ఆడలేదని, ప్రతి వేదికా కొత్తదేనని అన్నారు. తాము ఏ స్థితిలో అయతే వుండకూడదనుకున్నామో ప్రస్తుతం టోర్నీలో ఆ స్థితిలో ఉన్నామని, జట్టుని విజయాలవైపు నియంత్రించుకోవాలనుకున్నా అది సాధ్యంకాలేదని వివరించారు. జట్టు తరపున పూర్తిస్థాయి కసరత్తులు చేసినా ఓటములు ఎదురుకావడం టీమ్‌ని బాధిస్తోందని బ్రాడ్‌బర్న్ చెప్పారు.
ప్రతి మ్యాచ్‌కూ చాలా బాగా సిద్ధమయ్యామని, ఆడబోయే వేదికలపై కసరత్తులు చేసినా ప్రతికూల ఫలితాలే ఎదురయ్యాయని చెప్పారు. ప్రతి వేదిక తమకు కొత్తదేనన్నారు. క్రికెటర్ల నాణ్యత, నైపుణ్యాల మీద ఏమాత్రం అనుమానాలు లేవని, క్రికెటర్లు ప్రతికూలమని తాము భావించడంలేదన్నారు. కాగా వరల్డ్ కప్‌లో భాగంగా మంగళవారం బంగ్లాదేశ్‌తో జరగనున్న మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడుతూ పాక్ కోచ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా వరుస ఓటములు పాకిస్థాన్ సెమీస్ అవకాశాలను దెబ్బతీస్తున్నాయి. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు కేవలం 2 విజయాలు మాత్రమే సాధించింది.