Pakistan: పాక్ సెమీస్ ఆశలు సజీవం.. ఇలా చేస్తే నాకౌట్ బెర్త్ పక్కా!
- పాక్ సెమీస్ ఆశలు సజీవం
- తర్వాతి మూడు మ్యాచుల్లోనూ మంచి రన్‌రేట్‌తో గెలిస్తే సెమీస్‌కు
- ఇతర జట్ల ఓటమి కూడా పాక్‌కు లాభం చేకూర్చే అవకాశం
- మరో మ్యాచ్‌లో ఓడినా పోటీలోనే
ప్రపంచకప్‌లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న పాకిస్థాన్‌కు సెమీస్ ఆశలు ఇంకా మిణుకుమిణుకుమంటూనే ఉన్నాయి. హైదరాబాద్‌లో నెదర్లాండ్స్‌తో జరిగిన ఓపెనింగ్ మ్యాచ్‌లో విజయం సాధించిన తర్వాత అదే వేదికపై శ్రీలంకనూ ఓడించింది. అయితే, ఆ తర్వాతి నుంచి మాత్రం ఆ జట్టును కష్టాలు చుట్టుముట్టాయి. అహ్మదాబాద్ మ్యాచ్‌లో ఆతిథ్య ఇండియా చేతిలో ఓడింది మొదలు వరుస పరాజయాలు ఆ జట్టును వెక్కిరిస్తున్నాయి.
చెన్నైలో ఆఫ్ఘనిస్థాన్ చేతిలో ఓటమి ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని దారుణంగా దెబ్బతీసింది. ఆ తర్వాత సౌతాఫ్రికా చేతిలో గెలుపు అంచుల్లో నిలిచి ఓటమి పాలైంది. వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడినప్పటికీ ఆ జట్టు నెట్ రన్‌రేట్ (-0.387) మరీ దారుణంగా లేకపోవడం కొంత ఊరటనిచ్చే అంశమే. పాకిస్థాన్‌కు ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. కాబట్టి ఆ జట్టు సెమీస్ ఆశలు ఇంకా మిగిలి ఉన్నట్టే లెక్క.
ఇతర జట్ల గెలుపోటముల ప్రభావం
ఈ విషయంలో ఇతర జట్ల గెలుపోటములు కూడా పాక్‌పై ప్రభావం చూపిస్తాయి. పాక్ తన తర్వాతి మ్యాచ్‌లో బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లండ్‌తో తలపడాల్సి ఉంది. టాప్‌లో ఇండియా, సౌతాఫ్రికా జట్లు సెమీస్‌కు ఒక్క అడుగు దూరంలో నిలిచాయి. కివీస్, ఆస్ట్రేలియా మూడు నాలుగు స్థానాల్లో ఉన్నాయి. నాలుగేసి పాయింట్లతో ఉన్న శ్రీలంక, పాకిస్థాన్ ఆరు, ఏడు స్థానాల్లో ఉన్నాయి.
మిగతా మూడు మ్యాచ్‌లు గెలిస్తేనే
పాక్ తన తర్వాతి మూడు మ్యాచులను గెలిస్తే ఆ జట్టు ఖాతాలో 10 పాయింట్లు వస్తాయి. అంటే ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న కివీస్‌ను ఓడించాల్సి ఉంటుంది. అంతేకాదు, ఆస్ట్రేలియా తన తర్వాతి మూడు మ్యాచుల్లోనూ ఓడిపోతే ప్రస్తుతం ఉన్న 8 పాయింట్లతోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. అప్పుడు దాయాది జట్టు 10 పాయింట్లతో సెమీస్‌కు దూసుకెళ్తుంది. అదే సమయంలో శ్రీలంక కూడా తన తర్వాతి మూడు మ్యాచుల్లోనూ పరాజయం పాలైతేనే పాక్‌కు చాన్స్ ఉంటుంది.
న్యూజిలాండ్, శ్రీలంక ఓడినా సరే
ఒకవేళ పాకిస్థాన్, ఆస్ట్రేలియా జట్లు తదుపరి మూడు మ్యాచుల్లోనూ గెలిస్తే.. న్యూజిలాండ్ పాయింట్ల పట్టిక నుంచి కిందికి జారిపోతుంది. పాక్, ఆస్ట్రేలియా రెండూ కివీస్‌తో తలపడాల్సి ఉంది. అదే సమయంలో ఈ రెండు జట్లు మిగిలిన మ్యాచ్‌లను భారీ తేడాతో గెలిచి, న్యూజిలాండ్, శ్రీలంక జట్లు అన్ని మ్యాచుల్లోనూ ఓడిపోతే పాక్ నాలుగో స్థానానికి చేరుకుంటుంది.
ఒక్కటే నెగ్గితే ఇంటికి
ఒకవేళ పాకిస్థాన్ తదుపరి రెండు మ్యాచుల్లో మాత్రమే నెగ్గితే ఆ జట్టుకు ఖాతాలో 8 పాయింట్లు మాత్రమే ఉంటాయి. అప్పుడు పాక్ సెమీస్ అవకాశాలు క్లిష్టంగా మారతాయి. అయితే, పోటీలో మాత్రం ఉంటుంది. మరో రకంగా చూస్తే.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తమ తర్వాతి మ్యాచుల్లో ఓడిపోయి, శ్రీలంక రెండు మ్యాచుల్లో ఓడిపోతే కనుక అప్పుడు నెట్‌రన్‌రేట్ కీలకంగా మారుతుంది. కాబట్టి పాకిస్థాన్ తదుపరి మ్యాచుల్లో భారీ రన్‌రేట్‌తో విజయం సాధించాల్సి ఉంటుంది. అయితే, పాక్ రెండింటిలో ఓడి ఒకదాంట్లో గెలిస్తే మాత్రం ఇంటికి వెళ్లిపోవాల్సి ఉంటుంది.