loans: అత్యవసరంగా డబ్బు కావాల్సి వస్తే.. ఇవీ మార్గాలు
- ఎలాంటి హామీ అక్కర్లేనిది పర్సనల్ లోన్
- కారు, ప్రాపర్టీల తనఖాపై రుణం
- బంగారం, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ పైనా
- జీవిత బీమా పాలసీలు, డిపాజిట్లపై తక్కువ రేటు
అత్యవసరంగా డబ్బు కావాల్సి వచ్చింది. అప్పుడు ఏమిటి మార్గం..? స్నేహితులు లేదంటే బంధువుల సాయం కోరుతుండడం సహజం. వారి నుంచి ఎలాంటి సాయం అందకపోతే రుణాలను ఆశ్రయిస్తుంటారు. వడ్డీ లేకుండా నిధుల సాయం అందని వారికి.. అందుబాటులో ఉన్న రుణ మార్గాలు ఏంటో చూద్దాం.
వ్యక్తిగత రుణాలు
ఎలాంటి హామీ లేకుండా లభించే రుణం. అందుకే పర్సనల్ లోన్ పై వడ్డీ రేటు 10 శాతం నుంచి 29 శాతం వరకు ఉంటుంది. ఎంపిక చేసుకునే బ్యాంక్ లేదంటే ఎన్ బీఎఫ్ సీ ఆధారంగా ఈ రేట్లలో మార్పు ఉంటుంది. వ్యక్తిగత క్రెడిట్ స్కోర్ ఆధారంగా వడ్డీ రేటులో మార్పు ఉంటుంది. వ్యక్తిగత రుణం తమకు ఏ రేటుపై లభిస్తుందో పేటీఎం యాప్ నుంచి తెలుసుకోవచ్చు.
కారుపై రుణం
కారును తనఖా ఉంచి రుణం పొందొచ్చు. దీనిపైనా వడ్డీ రేటు 10-22 శాతం మధ్య ఉంటుంది. కారు విలువపై 50-200 శాతం వరకు రుణం లభిస్తుంది. మంచి పాప్యులర్ మోడల్, రీసేల్ వ్యాల్యూ ఉన్న వాటికి ఎక్కువ రుణం లభిస్తుంది.
మ్యూచువల్ ఫండ్స్, షేర్లపై రుణం
మ్యూచువల్ ఫండ్స్, షేర్లను తనఖా పెట్టి కూడా ఎన్ బీఎఫ్ సీలు, బ్యాంక్ లు రుణాలు ఇస్తున్నాయి. వీటిపై రేటు 9-11.25 శాతం మధ్య ఉంటుంది. విలువపై 50-80 శాతం మధ్య రుణం లభిస్తుంది. హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ అయితే షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ విలువపై 50 శాతం విలువ మేరే రుణంగా ఇస్తోంది. షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ విలువ పడిపోతుంటే మాత్రం అదనపు తనఖాను కోరతాయి.
డిపాజిట్లపై రుణం
ఫిక్స్ డ్ డిపాజిట్లపై బ్యాంక్ ల నుంచి రుణం పొందొచ్చు. కాకపోతే వీటిపై వడ్డీ రేటు తక్కువగానే ఉంటుంది. ఎలా అంటే ఉదాహరణకు మీ వద్దనున్న డిపాజిట్ పై 8 శాతం వడ్డీ రేటును బ్యాంక్ ఇస్తుందని అనుకుందాం. అప్పుడు అదే డిపాజిట్ ను అదే బ్యాంక్ శాఖకు తీసుకెళితే దాని విలువపై 80 శాతం వరకు రుణాన్ని ఇస్తాయి. దీన్ని ఓవర్ డ్రాఫ్ట్ రూపంలోనూ తీసుకోవచ్చు. వడ్డీ రేటు డిపాజిట్ రేటుపై 2-3 శాతం ఎక్కువగా ఉంటుంది. అంటే డిపాజిట్ పై 8 శాతం రేటు ఉంటే, రుణంపై 11 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తాయి.
జీవిత బీమా పాలసీపై రుణం
జీవిత బీమాలో ఎండో మెంట్ పాలసీల గురించి తెలిసే ఉంటుంది. జీవించి ఉన్నప్పటికీ, గడువు ముగిసిన తర్వాత ప్రయోజనాన్ని చెల్లించేవి. ఇలాంటి పాలసీలను తనఖా పెట్టి రుణం పొందొచ్చు. ఎల్ ఐసీ పాలసీలపై ఎల్ ఐసీ రుణం మంజూరు చేస్తుంది. వడ్డీ రేటు 10-11 శాతం మేర ఉంటుంది. పాలసీ సరెండర్ వ్యాల్యూలో 90 శాతం వరకు రుణంగా పొందుతారు.
ప్రాపర్టీపై రుణం
ప్రాపర్టీ డాక్యుమెంట్లను తనఖాగా పెట్టి రుణం పొందొచ్చు. వడ్డీ రేటు 8.50-18 శాతం మధ్య ఉంటుంది. ప్రాపర్టీ విలువలో 70 శాతం వరకు రుణంగా పొందొచ్చు.
బంగారంపై రుణం
బంగారంపై సులభంగా రుణాలు పొందొచ్చు. ఎన్ బీఎఫ్ సీ సంస్థలు సహా, అన్ని రకాల బ్యాంక్ లు గోల్డ్ లోన్స్ ను ఆఫర్ చేస్తున్నాయి. వీటిపై వడ్డీ రేటు 9-24 శాతం మధ్య ఉంటుంది. బంగారం విలువలో 75 శాతం వరకు రుణంగా పొందొచ్చు.