Nara Bhuvaneswari: విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో రైలు ప్రమాద బాధితులను పరామర్శించిన నారా భువనేశ్వరి
- ఆదివారం రాత్రి విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదం
- రెండు రైళ్లు ఢీకొని 13 మంది మృతి... 50 మందికి పైగా గాయాలు
- విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో క్షతగాత్రులకు చికిత్స
- బాధితులకు ధైర్యం చెప్పిన నారా భువనేశ్వరి
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అర్ధాంగి నారా భువనేశ్వరి నేడు విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో రైలు ప్రమాద బాధితులను పరామర్శించారు. విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో 13 మంది మృతి చెందగా, 50 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులకు విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ఇవాళ రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వచ్చిన నారా భువనేశ్వరి ప్రభుత్వ ఆసుపత్రిలో రైలు ప్రమాద బాధితులతో మాట్లాడి, వారికి ధైర్యం చెప్పారు. వైద్యులను అడిగి బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రైలు ప్రమాద బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు భువనేశ్వరి పేర్కొన్నారు.
ఈ పర్యటనలో నారా భువనేశ్వరి వెంట టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, సీనియర్ నేత కళా వెంకట్రావు తదితరులు ఉన్నారు.