Raghunandan Rao: కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి అంశంపై మరోసారి రఘునందన్ రావు స్పందన
- దాడితో తమకు సంబంధం లేదని పునరుద్ఘాటన
- ఎంపీపై దాడికి తనకు లేదా బీజేపీకి సంబంధం లేదని వెల్లడి
- తమ కార్యకర్తలపై దాడులు జరిగితే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని ఆగ్రహం
సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి మీద దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని దుబ్బాక ఎమ్మెల్యే, బీజేపీ నేత రఘునందన్ రావు మరోసారి స్పష్టం చేశారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... ఎంపీపై దాడికి తనకు లేదా బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. కానీ ఈ దాడి తర్వాత బీజేపీ కార్యకర్తలపై దాడులు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కార్యకర్తలపై దాడులు జరిగిన సమయంలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని ఆరోపించారు.
అప్రమత్తమైన ఇంటెలిజెన్స్
ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మీద దాడి నేపథ్యంలో ఇంటెలిజెన్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు కారు గుర్తుతో పోటీ చేస్తోన్న అభ్యర్థులకు భద్రత పెంచాలని నిర్ణయించారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలకు 2 ప్లస్ 2 భద్రత ఉంది. అయితే దాడి దృష్ట్యా భద్రతను 4 ప్లస్ 4కు పెంచాలని ఇంటెలిజెన్స్ అదనపు డీజీ ఆదేశించారు. ఈ మేరకు కమిషనర్లు, ఎస్పీలకు అదనపు డీజీ లేఖ రాశారు. ఈ రోజు నుంచి బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో పోటీ చేస్తున్న అభ్యర్థులకు అదనపు భద్రత కల్పిస్తారు.