Pakistan: పాకిస్థాన్ పేస్ బౌలింగ్ ధాటికి బంగ్లాదేశ్ కకావికలం
- వరల్డ్ కప్ లో నేడు పాకిస్థాన్ × బంగ్లాదేశ్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా
- 45.1 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌట్
- చెరో 3 వికెట్లు తీసిన షహీన్ అఫ్రిది, వసీం జూనియర్
- హరీస్ రవూఫ్ కు రెండు వికెట్లు
వరల్డ్ కప్ లో ఇవాళ పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ 45.1 ఓవర్లలో 204 పరుగులకు కుప్పకూలింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా జట్టును పాక్ పేసర్లు హడలెత్తించారు. మందకొడిగా ఉన్న పిచ్ పై బౌన్స్ లేనప్పటికీ, పాక్ పేసర్లు షహీన్ అఫ్రిది, మహ్మద్ వసీం జూనియర్, హరీస్ రవూఫ్ వ్యూహాత్మకంగా బౌలింగ్ చేశారు. అఫ్రిది 3, వసీం జూనియర్ 3, హరీస్ రవూఫ్ 2 వికెట్లు తీశారు. ఇఫ్తికార్ అహ్మద్ 1, ఉసామా మిర్ 1 వికెట్ పడగొట్టారు.
బంగ్లా బ్యాట్స్ మన్లలో ఓపెనర్ టాంజిద్ హుస్సేన్ తొలి ఓవర్లోనే డకౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ లిట్టన్ దాస్ 45 పరుగులు చేయగా, ఫామ్ లో ఉన్న మహ్మదుల్లా (56) అర్ధసెంచరీ నమోదు చేశాడు. కెప్టెన్ షకీబ్ అల్ హసన్ (43), మెహదీ హసన్ మిరాజ్ (25) ఓ మోస్తరుగా రాణించారు. మిగతా బ్యాట్స్ మెన్ విఫలం కావడంతో బంగ్లాదేశ్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది.