Sajjala Ramakrishna Reddy: ఆ మాత్రానికే నిజం గెలిచినట్టా?: చంద్రబాబుకు బెయిల్ పై సజ్జల వ్యాఖ్యలు
- స్కిల్ కేసులో చంద్రబాబుకు బెయిల్
- చంద్రబాబుకు ఇచ్చింది మధ్యంతర బెయిల్ మాత్రమేనన్న సజ్జల
- కంటికి శస్త్రచికిత్స కోసమే కోర్టు బెయిల్ ఇచ్చిందని వెల్లడి
- విజయోత్సవాలు చేసుకునే సందర్భమేనా ఇది అంటూ సజ్జల వ్యాఖ్యలు
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయిన చంద్రబాబు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో రాజమండ్రి జైలు నుంచి ఇవాళ విడుదలయ్యారు. దీనిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.
బయట చెప్పుకోవడానికి కూడా సంకోచించే చర్మ వ్యాధిని ప్రాణాంతకంగా చూపుతూ సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబుకు మంజూరు చేసింది మధ్యంతర బెయిల్ మాత్రమేనని, అది కూడా కంటికి శస్త్రచికిత్స చేయించకోవడానికి మాత్రమే ఇచ్చారని వెల్లడించారు. కానీ టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారని, చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇచ్చినంత మాత్రాన నిజం గెలిచినట్టా? అని విమర్శించారు.
చంద్రబాబు ఏమైనా స్వాతంత్ర సమరయోధుడా? లేక విప్లవకారుడా?... అసలిది వేడుకలు చేసుకోవాల్సిన సమయమేనా? అని సజ్జల ప్రశ్నించారు. నాడు అలిపిరి ఘటన జరిగినప్పుడే చంద్రబాబును ఎవరూ పట్టించుకోలేదని, ఇప్పుడు జైలుకు వెళ్లినా ఎవరూ బాధపడలేదని ఎద్దేవా చేశారు. చికిత్స తర్వాత చంద్రబాబు మళ్లీ జైలుకు వెళ్లాల్సిందేనని వ్యాఖ్యానించారు. చంద్రబాబు జైల్లో ఉన్నా ఒకటే, బయట ఉన్నా ఒకటేనని అన్నారు.
స్కిల్ డెవలప్ మెంట్ వ్యవహారంలో చంద్రబాబు పాత్ర స్పష్టంగా ఉంది కాబట్టే అరెస్ట్ చేశారని వెల్లడించారు.