Rushi Konda: రుషికొండపై నిర్మాణాలను మరోసారి పరిశీలించాలంటూ కేంద్రానికి ఏపీ హైకోర్టు ఆదేశాలు
- రుషికొండపై ఉల్లంఘనలు జరిగాయంటూ గతంలో పిటిషన్లు
- విశాఖకు మకాం మార్చుతున్నట్టు సీఎం జగన్ వెల్లడి
- హైకోర్టులో మరో పిటిషన్ వేసిన గత పిటిషనర్లు
విశాఖలోని రుషికొండపై ఉల్లంఘనలు జరిగాయంటూ గతంలో ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. దీనిపై అప్పట్లో విచారణ చేపట్టిన న్యాయస్థానం పరిశీలన కోసం ఓ కమిటీని నియమించింది. ఆ కమిటీ రుషికొండపై జరుగుతున్న నిర్మాణాలపై ఓ నివేదిక ఇచ్చింది. అనుమతికి మించి నిర్మాణాలు ఉన్నాయని ఆ కమిటీ పేర్కొంది.
అయితే, సీఎం జగన్ తాను విశాఖకు మకాం మార్చుతున్నానంటూ, ప్రభుత్వ భవనాల నిర్మాణం కోసం ప్రత్యేక కమిటీ వేశారు. రుషికొండపై నూతనంగా చేపట్టిన నిర్మాణం బాగుందంటూ ఈ కమిటీ నివేదిక ఇచ్చేందుకు సన్నద్ధమైంది. దాంతో, రుషికొండ ఉల్లంఘనలపై మొదట్లో పిటిషన్లు వేసిన వారు హైకోర్టులో మరో పిటిషన్ వేశారు.
తాజాగా, రుషికొండ నిర్మాణాలపై మరోసారి విచారణ చేపట్టిన హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. తాము నియమించిన కమిటీ ఇచ్చిన నివేదికపై మరోసారి విచారణ చేపట్టాలని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శిని ఆదేశించింది. రుషికొండపై ఉన్న నిర్మాణాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
అంతేకాదు, దీనిపై మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలని కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంలో తదుపరి విచారణను నవంబరు 28కి వాయిదా వేసింది.
రుషికొండపై 9.88 ఎకరాలకు అనుమతి ఇస్తే, 20 ఎకరాల్లో తవ్వకాలు చేపట్టారని అప్పట్లో పిటిషన్లు వేశారు. విచారణ సందర్భంగా అనుమతికి మించి 3 ఎకరాలు ఎక్కువ తవ్వకాలు చేపట్టినట్టు ప్రభుత్వం అంగీకరించింది. అయితే, అంతకంటే ఎక్కువే తవ్వకాలు చేపట్టారని పిటిషనర్ ఆరోపించడంతో, కేంద్ర ప్రభుత్వం సర్వే చేపట్టింది. ఇప్పుడు హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో, రుషికొండలో కేంద్రం మరోసారి సర్వే చేపట్టే అవకాశాలున్నాయి.