Revanth Reddy: మేం కత్తులతో పొడిచే వాళ్లమే అయితే, మీరు రోడ్డుపై తిరిగే వారా?: కేసీఆర్పై రేవంత్ రెడ్డి ఆగ్రహం
- కొత్త ప్రభాకర్ రెడ్డిని ఎవడో కత్తితో పొడిస్తే మాపై నెపం నెడుతున్నారని రేవంత్ మండిపాటు
- దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన కుటుంబం తమ పార్టీ అని వ్యాఖ్య
- తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి అధికారం ఇవ్వాలని విజ్ఞప్తి
తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి ఈసారి అధికారం ఇవ్వండని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కొల్లాపూర్లో నిర్వహించిన పాలమూరు ప్రజా భేరీ సభలో ఆయన మాట్లాడుతూ... ఈ సభకు ప్రియాంక గాంధీ రావాల్సి ఉందని, కానీ అనారోగ్యం కారణంగా రాలేకపోయారన్నారు. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అయితే లక్షకోట్లు సంపాదిస్తారని ఆరోపించారు. కేసీఆర్ ఇంట్లోని నలుగురికి నాలుగు పదవులు ఉన్నాయని, ఇప్పుడు మరోసారి అధికారంలోకి వస్తే మనవడికి కూడా పదవి వస్తుందని ఎద్దేవా చేశారు.
నల్లమల బిడ్డగా అడుగుతున్నానని, ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి 14 సీట్లు ఇవ్వాలని కోరారు. పాలమూరును పసిడి పంటలు పండే జిల్లాగా మార్చాలంటే మనవాడే కీలక పదవిలో ఉండాలన్నారు. ఈ రోజు సోనియా గాంధీ తనను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా చేశారని, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 14 సీట్లు గెలిపిస్తే తమ ఆరు గ్యారెంటీలే తమ అభ్యర్థులు అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధు రాదు అని చెప్పడానికి కేసీఆర్కు బుద్ధి ఉండాలన్నారు. రైతులకు రూ.15వేలు, భూమిలేని వారికి రూ.12వేలు ఇస్తానని సోనియా చెప్పలేదా? అని నిలదీశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు.
దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిని ఎవడో కత్తితో పొడిస్తే ఆ నెపం కాంగ్రెస్ పైన నెడుతున్నారని కేసీఆర్పై మండిపడ్డారు. అసలు మేం కత్తులతో పొడిచే వాళ్లమే అయితే నువ్వు.. నీ కొడుకు.. నీ అల్లుడు రోడ్డుపై తిరిగేవారా? అని ప్రశ్నించారు. దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన కుటుంబం మా పార్టీ అన్నారు. చిల్లర మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.