Chandrababu: బెయిలు కోసం చంద్రబాబుకు ష్యూరిటీ ఇచ్చింది వీరే.. న్యాయాధికారి అడిగిన ప్రశ్నలివే!
- నిన్న మధ్యంతర బెయిలుపై విడుదలైన చంద్రబాబు
- జామీను ఇచ్చిన దేవినేని, బోండా ఉమామహేశ్వరరావు
- చెరో లక్ష రూపాయల చొప్పున ష్యూరిటీ
స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు 52 రోజుల తర్వాత నిన్న మధ్యంతర బెయిలుపై విడుదలయ్యారు. ఆయన విడుదల కోసం టీడీపీ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, బోండా ఉమామహేశ్వరరావు లక్ష రూపాయల చొప్పున ష్యూరిటీలు సమర్పించారు. ఇందుకోసం విజయవాడ ఏసీబీ కోర్టుకు హాజరైన వారిని న్యాయాధికారి హిమబిందు పలు ప్రశ్నలు అడిగారు.
తొలుత ఇద్దరి పేర్లు అడిగి తెలుసుకున్న హిమబిందు.. ఆ తర్వాత, మీరు ఎవరికి జామీను ఇస్తున్నారో తెలుసా? అని ప్రశ్నించారు. దీనికి వారు చంద్రబాబునాయుడికి అని సమాధానం చెప్పారు. ష్యూరిటీ ఎంతమొత్తం చెల్లించారని ప్రశ్నించగా చెరో రూ. లక్ష అని సమాధానం ఇచ్చారు. అనంతరం ఇద్దరు నేతలు కోర్టు బయట మీడియాతో మాట్లాడుతూ.. సుప్రీంకోర్టులోనూ చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.