Daggubati Purandeswari: టీటీడీకి వార్నింగ్ ఇచ్చిన పురందేశ్వరి
- ఇష్టానుసారం మంటపాలను తొలగిస్తున్నారంటూ పురందేశ్వరి మండిపాటు
- 75 ఏళ్లు పూర్తి చేసుకున్న వాటి తొలగింపుకు పురావస్తుశాఖ అనుమతి తప్పనిసరి అని వ్యాఖ్య
- ఇష్టానుసారం చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరిక
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)పై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి మండిపడ్డారు. ఇష్టానుసారం నిర్మాణాలను తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తిరుమలలోని పార్వేటి మంటపాన్ని తొలగించి యథావిధిగా నిర్మిస్తామని చెప్పారని... ఆ తర్వాత ఇష్టానుసారంగా చేశారని విమర్శించారు. ఇప్పుడు అలిపిరి మంటపాన్ని తొలగిస్తామని చెపుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మంటపాలను తొలగించాలంటే కేంద్ర పురావస్తు శాఖ అనుమతి, పర్యవేక్షణ తప్పనిసరి అని చెప్పారు. అలిపిరి మంటపాన్ని 500 సంవత్సరాల కంటే ముందే నిర్మించారని... దాన్ని ఏమి చేయాలన్నా పురావస్తుశాఖ అనుమతి తీసుకోవాలని అన్నారు. ఇష్టానుసారం వ్యవహరిస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని... ప్రతిఘటిస్తుందని వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు పురందేశ్వరి అలిపిరిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.