Eluri Sambasiva Rao: కల్తీ మద్యంతో 30 వేల మంది ప్రాణాలను జగన్ బలి తీసుకున్నారు: ఏలూరి సాంబశివరావు
- నాలుగేళ్లలో మద్యం అమ్మకాల్లో రూ. 24 వేల కోట్లు దిగమింగారన్న సాంబశివరావు
- చంద్రబాబుపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపాటు
- స్కిల్ కేసులో బెయిల్ వస్తుందనే కొత్త కేసు పెట్టించారని విమర్శ
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కల్తీ మద్యంతో 40 లక్షల మంది పేదల్ని ఆసుపత్రి పాలు చేశారని టీడీపీ నేత ఏలూరి సాంబశివరావు ఆరోపించారు. వీరిలో 30 వేల మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు. అలాంటి జగన్ మద్యం టెండర్లలో చంద్రబాబు తప్పు చేశారని అనడం సిగ్గుచేటని చెప్పారు. నాలుగేళ్లలో మద్యం అమ్మకాల ద్వారా రూ. 24 వేల కోట్లు దిగమింగారని దుయ్యబట్టారు. చంద్రబాబుపై నిందలు వేస్తూ తన మద్యం దోపిడీని ప్రజలకు తెలియకుండా చేయాలనుకుంటున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో జరుగుతున్న మద్యం అమ్మకాలు, తయారీ, సరఫరా, డిస్టిలరీస్ పై సీబీఐ విచారణ కోరే ధైర్యం జగన్ కు ఉందా? అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం దాదాపు 100కు పైగా మద్యం బ్రాండ్లకు ఎలా అనుమతి ఇచ్చిందో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుకి మధ్యంతర బెయిల్ వస్తుందని తెలిసే జగన్.. తాను ఆడమన్నట్టు ఆడే వాసుదేవరెడ్డి ద్వారా చంద్రబాబుపై మద్యం కేసు పెట్టించారని మండిపడ్డారు. జగన్ కుట్రతో, కక్షసాధింపుతో చంద్రబాబుపై తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపాడని, ఆ కేసుని నిరూపించలేక ఇటు ప్రజల్లో, అటు న్యాయస్థానంలో తీవ్రంగా అవమానపడ్డాడని, స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై బయటకు వస్తాడని ముందే పసిగట్టిన జగన్, టీడీపీ అధినేతపై మొన్నటికి మొన్న హడావుడిగా మరో తప్పుడు కేసు నమోదు చేశారని అన్నారు.