Rohit Sharma: శ్రీలంకపై మ్యాచ్‌లో అశ్విన్‌కు చోటు?.. బౌలర్లపై కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు
- వికెట్ స్పిన్‌కు అనుకూలమైతే ముగ్గురు స్పిన్నర్లతో ఆడే ఛాన్స్ ఉందని వ్యాఖ్య
- అన్ని రకాల కాంబినేషన్లకు అవకాశం ఉందని వెల్లడి
- ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కెప్టెన్ రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రపంచ కప్ 2023లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా నేడు (గురువారం) శ్రీలంకతో టీమిండియా తలపడనుంది. ఇందుకు సంబంధించిన ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. టోర్నీలో ఇప్పటివరకు భారత బౌలర్లు అద్భుతంగా రాణించారని ప్రశంసించాడు. బౌలర్ల శారీరక అలసట గురించి స్పందిస్తూ.. భారత బౌలర్లు మంచి లయలో ఉన్నారని, ఈ సమయంలో వారు విశ్రాంతి కోరుకోవడంలేదని రోహిత్ అన్నాడు. శారీరకంగా బాగానే ఉన్నట్టు బౌలర్లు అందరూ తన వద్ద అభిప్రాయపడ్డారని వివరించారు. అలసటను దృష్టిలో ఉంచుకుని కొంతమంది బౌలర్లకు విశ్రాంతి ఇస్తారా అని విలేకర్లు ప్రశ్నించగా రోహిత్ శర్మ ఈ సమాధానం ఇచ్చాడు.
అవసరమైతే ముగ్గురు స్పిన్నర్లు..
వాంఖడే వికెట్ స్పిన్-ఫ్రెండ్లీగా కనిపిస్తే శ్రీలంకపై మ్యాచ్‌లో ఇద్దరు స్పిన్నర్లకు బదులుగా ముగ్గురు స్పిన్నర్లతో ఆడించే అవకాశం లేకపోలేదని రోహిత్ అన్నాడు. అన్ని రకాల కాంబినేషన్లు సాధ్యమేనని ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు. అవసరాన్ని బట్టి ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు సీమర్లతో బరిలో దిగవచ్చునని పేర్కొన్నాడు. ఈ వరల్డ్ కప్‌లో స్పిన్నర్లు చాలా నైపుణ్యంతో మిడిల్ ఓవర్లలో రన్స్ తక్కువగా ఇస్తుండడాన్ని చూస్తూనే ఉన్నామని పేర్కొన్నాడు. ఒకవేళ రోహిత్ శర్మ చెప్పినట్టుగా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగితే రవిచంద్రన్ అశ్విన్‌కు చోటుదక్కడం ఖాయం. మరి నిజంగా అశ్విన్‌కు చోటు దక్కుతుందా?, లేదా ఇద్దరు స్పిన్నర్లకే పరిమితమవుతారా అనేది మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది. ఇదిలావుండగా గురువారం శ్రీలంకపై టీమిండియా విజయం సాధిస్తే సెమీస్ బెర్త్ ఖరారు అవుతుంది.