Kinjarapu Acchamnaidu: కోర్టు నిబంధనల ప్రకారమే చంద్రబాబు కాన్వాయ్ సాగింది: అచ్చెన్నాయుడు
- ప్రజలు ఛీకొడుతున్నా వైసీపీ వాళ్లు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారన్న అచ్చెన్నాయుడు
- బాబుకు మద్దతుగా ప్రజలు ర్యాలీ నిర్వహిస్తే ప్రభుత్వానికి ఇబ్బంది ఏంటని ప్రశ్న
- కారులో కూర్చునే బాబు తన కోసం వచ్చిన ప్రజలకు అభివాదం చేశారని స్పష్ఠీకరణ
కోర్టు నిబంధనల మేరకు రాజమహేంద్రవరం నుంచి విజయవాడ వరకూ చంద్రబాబు కాన్వాయ్ సాగిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. బాబుకు మద్దతుగా ప్రజలు ర్యాలీలు చేస్తే ప్రభుత్వ సలహాదారు రామకృష్ణా రెడ్డి, వైసీపీ నేతలకు వచ్చిన ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. ప్రజలు ఛీకొడుతున్నా వైసీపీ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
‘‘రాజమహేంద్రవరం నుంచి విజయవాడ రావటానికి చంద్రబాబుకు 14 గంటల సమయం పట్టింది. కోర్టు నిబంధనలు లేకపోతే ఇప్పుడు వచ్చినదానికంటే నాలుగు రెట్లు అధికంగా జనం వచ్చేవారు. చంద్రబాబు నిబంధనలు ఉల్లంఘించకుండా కారులోనే ఉండి ప్రజలకు, కార్యకర్తలకు అభివాదం చేశారు. లోకేశ్ ఢిల్లీ వెళితే వైసీపీ వాళ్లకెందుకు ఉలికిపాటు. అక్రమ కేసులో చంద్రబాబును 52 రోజులు నిర్బంధించారు. ఆయన అవినీతికి పాల్పడ్డట్టు ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వ హయాంలో మద్యం పాలసీ అవకతవకలు జరిగాయంటూ మరో కొత్త కేసు పెట్టారు. వైసీపీ వాళ్లు ఎన్ని కుట్రలు చేసినా టీడీపీని ఏమీ చేయలేరు’’ అని పేర్కొన్నారు.