APPSC: త్వరలో ఏపీ గ్రూప్-1, 2 నోటిఫికేషన్లు.. ఏపీపీఎస్సీ ప్రకటన
- ఈ నెలఖరులోపు గ్రూప్స్ నోటిఫికేషన్
- మొత్తం 1603 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల జారీ చేయనున్న ఏపీపీఎస్సీ
- పరీక్ష విధానం, సిలబస్‌లో మార్పులపై నిపుణులు, ఉద్యోగార్థులతో చర్చ
- సలహాల పరిశీలన అనంతరం గ్రూప్స్ పరీక్షల్లో సమూల మార్పులు
ఏపీ ప్రభుత్వ గ్రూప్-1, 2 ఉద్యోగాల భర్తీకి ఈ నెలాఖరులోపు నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నట్టు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా ప్రకటించింది. 88 గ్రూప్-1 పోస్టులు, 989 గ్రూప్-2 పోస్టులు భర్తీ చేయనున్నట్టు బుధవారం వెల్లడించింది. నొటిఫికేషన్లోని గ్రూప్-1 పోస్టులకు అదనంగా క్యారీ ఫార్వర్డ్ ఉద్యోగాలు కూడా ఉంటాయని వెల్లడించింది. ఇక గ్రూప్-1 పరీక్షల నిర్వహణకు కొత్త విధానాన్ని రూపొందిస్తున్నామని వెల్లడించిన ఏపీపీఎస్సీ, ఈ దిశగా నిపుణులు, ఉద్యోగార్థులతో సంప్రదింపులు జరుపుతున్నామని కూడా పేర్కొంది. వారి సలహాల పరిశీలన తరువాత సిలబస్, పరీక్షల్లో సమూల మార్పులు తెస్తామని పేర్కొంది. కాగా, గ్రూప్స్‌తో పాటూ డిగ్రీ, జూనియర్ కళాశాలల లెక్చరర్ల భర్తీకి సంబంధించిన నొటిఫికేషన్లు కూడా ఈ నెలలోనే విడుదల చేయనున్నట్టు పేర్కొంది. ఈ మేరకు కమిషన్ కార్యదర్శి జె.ప్రదీప్‌కుమార్ వెల్లడించారు.
భర్తీ చేసే పోస్టులు ఇవే..
డిగ్రీ కళాశాలల అధ్యాపకులు-267, పాలిటెక్నిక్ కళాశాలల అధ్యాపకులు-99, టీడీడీ డీఎల్, జేఎల్-78, జూనియర్ కళాశాలల అధ్యాపకులు-47, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్-38, ఇంగ్లిష్ రిపోర్టర్స్ (ఏపీ లెజిస్లేచర్ సర్వీస్)-10, గ్రంథపాలకులు (కళాశాల విద్య)-23, ఏపీఆర్ఈఐ సొసైటీ కింద 10 జేఎల్, 5 డీఎల్ పోస్టులు, ఫిషరీస్ డిపార్ట్మెంటులో 4 డెవలప్మెంట్ ఆఫీసర్, మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 4 గ్రంథపాలకుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. వీటితో పాటూ, భూగర్భ నీటిపారుదల శాఖ, జిల్లా సైనిక్ వెల్ఫేర్ సర్వీసెస్, ఏపీ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ సర్వీస్, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ కేటగిరీ-2, సీనియర్ ఎకౌంటెంట్ కేటగిరీ-3, జూనియర్ ఎకౌంటెంట్ కేటగిరీ-4 కింద మరికొన్ని పోస్టులు భర్తీకి నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి.