Rahul Gandhi: మేడిగడ్డను పరిశీలించిన రాహుల్‌గాంధీ.. దోపిడీని చూసేందుకే వచ్చానన్న కాంగ్రెస్ అగ్రనేత
- శంషాబాద్ నుంచి హెలికాప్టర్‌లో మేడిగడ్డ చేరుకున్న రాహుల్
- ఆయన వెంట రేవంత్, మల్లు భట్టి విక్రమార్క కూడా
- మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో భారీ భద్రత
- బ్యారేజీ వద్దకు వెళ్లేందుకు కాంగ్రెస్ కార్యకర్తల యత్నం
- అడ్డుకుని అదుపులోకి తీసుకున్న పోలీసులు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ కొద్దిసేపటి క్రితం మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. అనంతరం ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ ఉదయం శంషాబాద్ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ చేరుకున్న ఆయన ఇటీవల కుంగిన లక్ష్మీ బ్యారేజీని పరిశీలించారు. ఆయన వెంటనే పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క కూడా ఉన్నారు. అనంతరం హెలికాప్టర్‌లో ఏరియల్ సర్వే నిర్వహించారు.
మరోవైపు, బ్యారేజీ పరిశీలనకు పోలీసులు ఇతరులెవరికీ అనుమతి ఇవ్వలేదు. కాంగ్రెస్ కార్యకర్తలను బ్యారేజీ వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాటిని తోసుకుంటూ బ్యారేజీ వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేసిన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో రాహుల్ పర్యటనకు పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.
లక్ష కోట్ల బ్యారేజీ రెండేళ్లకే సరి
ప్రాజెక్టు పరిశీలన అనంతరం రాహుల్ మాట్లాడుతూ.. లక్ష కోట్ల రూపాయలతో నిర్మించిన బ్యారేజీ రెండేళ్లలోనే దెబ్బతినడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. నిధుల దోపిడీ, నిర్మాణంలో అక్రమాల వల్లే ఇలా జరిగిందని ఆరోపించారు. మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టు పనులు నాసిరకంగా ఉన్నాయని విమర్శించారు. దర్యాప్తు సంస్థల అధినేత అమిత్‌షా అవినీతిపై మోదీ చర్యలు తీసుకోలేదని రాహుల్ పేర్కొన్నారు.
తెలంగాణలో దోపిడీ చూసేందుకే వచ్చా
అంతకుముందు మేడిగడ్డ అంబటిపల్లిలో జరిగిన మహిళా సదస్సులో రాహుల్ మాట్లాడుతూ.. తెలంగాణలో పెద్ద ఎత్తున జరుగుతున్న దోపిడీ, అన్యాయాన్ని చూసేందుకే వచ్చినట్టు చెప్పారు. బీఆర్ఎస్ పాలనతో ఈ తొమ్మిదిన్నరేండ్లలో లక్ష కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్‌కు, కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు ఏటీఎంలా మారిందని విమర్శించారు. రాష్ట్ర సంపదను కేసీఆర్ దోచుకోవడం వల్ల మహిళలు ఎక్కువగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఒకవైపు.. కాంగ్రెస్ మరోవైపు ఉందని పేర్కొన్నారు.