Basara: బాసర ఆలయంలో పాములు.. భయాందోళనలో భక్తులు.. వీడియో ఇదిగో!
- ఇటీవలే ఓ పూజారిని కాటేసిన వైనం
- తాజాగా జ్ఞానసరస్వతి ఆలయంలో మరో పాము
- ఆలయ భోజనశాలలో మరో పాము
బాసర జ్ఞానసరస్వతి ఆలయంలో పాములు కలకలం సృష్టిస్తున్నాయి. ఇటీవలే ఆలయ ప్రాంగణంలోని శ్రీదత్తాత్రేయ గుడిలో ఓ పూజారిని పాము కాటేసింది. దీంతో ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స తర్వాత పూజారి కోలుకున్నారు. భక్తులకు అన్నప్రసాదం పెట్టే భోజనశాలలోనూ పాము కనిపించింది. ఆలయ సిబ్బంది సమాచారమివ్వడంతో స్నేక్ క్యాచర్ వచ్చి పామును బంధించాడు. తాజాగా జ్ఞానసరస్వతి ఆలయంలో మరో పాము కనిపించడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు.
గత నెల రోజులుగా ఆలయంలో పాములు సంచరిస్తున్నాయని, తెల్లవారుజామును అమ్మవారికి అభిషేకం చేయడానికి వెళ్లాలంటే చాలా భయంగా ఉంటోందని పూజారులు చెబుతున్నారు. అభివృద్ధి పనుల్లో భాగంగా ఆలయం వెనుక ఉన్న కొండచరియలు తొలగిస్తుండటంతో వాటిలోని పాములు, కొండచిలువలు ఆలయంలోకి ప్రవేశిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. తెల్లవారుజామున ఆలయానికి వెళ్లే పూజారులు హోంగార్డ్స్ ను వెంటబెట్టుకుని వెళ్లాలని ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సూచించారు.