KTR: కేసీఆర్ పట్టుదలతో ముందుకు సాగారు.. అందుకే ఇక తిరిగి వెనక్కి చూసుకోలేదు: కేటీఆర్
- ఒక లక్ష్యంతో ముందుకు సాగితే విజయం వరిస్తుందనేందుకు కేసీఆర్ జీవితం ఉదాహరణ అన్న కేటీఆర్
- మారుమూల ప్రాంతంలో పుట్టిన కేసీఆర్ పట్టుదలతో ముందడుగు వేశారన్న కేటీఆర్
- గిరిజన పారిశ్రామికవేత్తలను చూస్తుంటే సంతోషంగా ఉందన్న మంత్రి
ఒక లక్ష్యంతో ముందుకు సాగితే విజయం వరిస్తుందని, దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ జీవితమే ఉదాహరణ అని మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్లో గిరిజన పారిశ్రామికవేత్తల సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ మారుమూల ప్రాంతంలో పుట్టారని, ముంబైలోని షాపూర్ జీ పల్లోంజీ కంపెనీలో కాంట్రాక్టులు చేశారన్నారు. రాజకీయాల్లోకి ప్రవేశించిన మొదట్లో సింగిల్ విండో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారన్నారు. అయినా పట్టుదలతో ముందుకు సాగారన్నారు. ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచిన కేసీఆర్, తిరిగి వెనక్కి చూసుకోలేదన్నారు.
గిరిజన పారిశ్రామికవేత్తలను చూస్తుంటే తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో ఐదువేల మంది యువతను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. అవసరమైతే ఎస్టీ ఎంటర్ప్రెన్యూయర్స్ కోసం ప్రత్యేకంగా ఉత్పత్తుల పార్క్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ సంస్థలతో కలిసి పని చేసేవారికి ప్రోత్సాహం అందిస్తామన్నారు. భవిష్యత్తుకు మీరంతా మార్గదర్శకులు కావాలని సూచించారు. ఇప్పుడు పారిశ్రామికవేత్తల సక్సెస్ మీట్ ఏర్పాటు చేసుకున్నామని, వచ్చే నెల 3న మరోసారి విజయం సాధించి సక్సెస్ మీట్లో పాల్గొందామన్నారు.